Narendra Modi On Subhash Chandra Bose : స్వాతంత్య్రం అనంతరం భారత్లో బంధుప్రీతి, రాజవంశం అనేవి ఆధిపత్యం చెలాయించి దేశ అభివృద్ధిని అడ్డుకున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. యువత, మహిళలు దేశ రాజకీయాలను బంధుప్రీతి, అవినీతి నుంచి విముక్తి చేయగలరని తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, సహకారం దేశంలోని యువతకు స్ఫూర్తి అన్నారు. దిల్లీలోని ఎర్రకోటలో జరిగిన పరాక్రమ్ దివస్(నేతాజీ 127వ జయంతి) సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.
అప్పట్లో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను నేతాజీ బాగా అర్థం చేసుకున్నారని, వాటి గురించి అందరినీ హెచ్చరించారని ప్రదాని మోదీ తెలిపారు. నేతాజీ ప్రజలను జాగృతం చేయడంపై దృష్టి పెట్టారని అన్నారు.'స్వాతంత్ర్యం తర్వాత భారత్లో బంధుప్రీతి, వంశపారంపర్యం వంటివి దేశ ప్రజాస్వామ్యాన్ని శాసించడం ప్రారంభించాయి. భారత్ అభివృద్ధి చెందాల్సిన వేగం కంటే అభివృద్ధి చెందకపోవడానికి ఇవి కూడా ప్రధాన కారణం. బానిసత్వం అనేది పాలనకు మాత్రమే సంబంధించినది కాదని, ఆలోచనలు, పనులలో కూడా ఉందని నేతాజీకి తెలుసు. అందుకే ఆయన ఆ కాలంలోని యువతను మేల్కొల్పడంపై దృష్టి సారించారు.' అని మోదీ పేర్కొన్నారు.