Lowest Margin Candidate In Lok Sabha Polls : లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ మెజార్టీ మార్క్‌ను సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సార్వత్రిక పోరులో చాలాచోట్ల అనూహ్య ఫలితాలు వచ్చాయి. నార్త్- వెస్ట్ ముంబయిలో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిందే వర్గం అభ్యర్థి రవీంద్ర వైకర్ కేవలం 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాగే బిహార్‌లోని సమస్తీపుర్‌లో ఎల్జేపీ(ఆర్) తరఫున గెలిచిన శాంభవి చౌదరీ దేశంలోనే అత్యంత పిన్న వయసు ఎంపీగా నిలిచారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో ఆరుగురు స్వతంత్రులు సత్తా చాటారు.
48ఓట్ల తేడాతో విజయం
శివసేన(యూబీటీ) అభ్యర్థి అమోల్ కీర్తికర్‌పై శిందే వర్గం అభ్యర్థి రవీంద్ర వైకర్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో 48 తేడాతో గెలుపొందారు. రవీంద్ర వైకర్‌కు 4,52,644 ఓట్లు రాగా, అమోల్ కీర్తికర్ కు 4,52,596 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకుని ఆధిపత్యం చెలాయించినా, నార్త్ వెస్ట్ ముంబయిలో మాత్రం శిందే వర్గం తరఫున పోటీ చేసిన రవీంద్ర వైకర్ విజయం సాధించారు.
అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు
బిహార్‌లో ఎన్డీఏ మిత్రపక్షమైన ఎల్జేపీ(ఆర్) సత్తా చాటింది. 5 స్థానాల్లో చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఆ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఎల్జేపీ(ఆర్) తరఫున సమస్తీపుర్ నుంచి పోటీ చేసిన శాంభవీ చౌధరీ కాంగ్రెస్ అభ్యర్థి సన్నీ హజారీపై 1,87,537 ఓట్ల తేడాతో విజయం సాధించి దేశంలోనే పిన్న వయస్కురాలైన ఎంపీగా నిలిచారు. ఎంపీగా ఎన్నికైన నాటికి శాంభవి వయసు(25ఏళ్ల 11 నెలల 20 రోజులు)మాత్రమే.