Siddaramaiah Muda Case :మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూముల వ్యవహారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఉపశమనం లభించింది. ఈ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనతోపాటు భార్యకు వ్యతిరేకంగా ఆధారాల్లేవని లోకాయుక్త పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సీఎంతో పాటు ఆయన సతీమణి పార్వతి, తదితరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని తేల్చి చెప్పారు.
స్నేహమయికి వారం రోజులు గడువు
ఈ అంశంపై తుది నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నట్లు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణకు రాసిన లేఖలో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో తొలి నలుగురు నిందితులపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేకపోవడం వల్ల నిరూపితం కాలేదని తెలిపారు. ఈ నివేదికపై అభ్యంతరాలు తెలిపేందుకు స్నేహమయికి వారం రోజులు గడువు ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కన్నడ రాజకీయాలను కుదిపేసిన వ్యవహారం
ముడా భూముల వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు రావడం కన్నడ రాజకీయాలను కుదిపేసింది. దీంతో ఈ కేసు తెరపైకి వచ్చీ రాగానే రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులోనే లోకాయుక్త విచారణకు ఆదేశించింది. గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫిర్యాదుదారులు టి.జె.అబ్రహం, స్నేహమయి కృష్ణ పిటీషన్లపై విచారణ చేపట్టిన కోర్టు గత సెప్టెంబరులో నివేదిక ఇవ్వాల్సిందిగా పోలీసులకు ఆదేశించింది.
వారి పాత్ర లేదని గుర్తించిన పోలీసులు
ముఖ్యమంత్రి, ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జునపై కేసులు నమోదు కావటం, లోకాయుక్త ఎస్‌పీ టి.జె.ఉదేశ్ నేతృత్వంలో విచారణ ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి ఏ1 నిందితుడిగా కేసు నమోదు కాగానే ఆయన భార్య తనకు ముడా ఇచ్చిన స్థలాలను వెనక్కి ఇచ్చేయడం, విచారణ కోసం గతేడాది నవంబరు 5న ముఖ్యమంత్రి మైసూరులోని లోకాయుక్త కార్యాలయంలో విచారణకు హాజరవటం వంటి పరిణామాలు కొద్ది రోజులపాటు చకచకా జరిగిపోయాయి. ఈ విచారణ ప్రక్రియలో ముఖ్యమంత్రి గానీ, ఆయన కుటుంబ సభ్యుల పాత్ర గానీ లేదని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.