Most Expensive Indian Weddings Of All Times :ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు అంటే మామూలుగా ఉండవు అని తెలిసిందే. 2024 జులై 12న ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల రాయల్ వెడ్డింగ్ జరగనుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుక జూలై 12న "శుభ్ వివాహం"తో ప్రారంభమై, జూలై 13న "శుభ్ ఆశీర్వాద్" కార్యక్రమం, జూలై 14న "మంగళ ఉత్సవ్"తో ముగుస్తుంది. అయితే వీరి వివాహానికి ముందు ఆ కుటుంబంలో ఇతర వివాహాలు కూడా ఇలాగే చాలా ఆర్భాటంగా జరిగాయి.
ఆకాశ్ అంబానీ- శ్లోకా మెహతా :ముకేశ్ అంబానీ, నీతా అంబానీల మొదటి కుమారుడైన ఆకాశ్ అంబానీ వివాహం శ్లోకా మెహతాతో 2019లో జరిగింది. వీరి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్, వివాహానికి 2 రోజుల ముందు సెయింట్ మోరిట్జ్‌లో అత్యంత సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో భారీ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు అమీర్ ఖాన్ దంపతులు, నటుడు జాకీ ష్రాఫ్, మనీష్ మల్హోత్రా వచ్చారు. అలాగే యూఎన్ మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ-మూన్, అతని భార్య యు సూన్-టేక్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ భార్య చెరీ బ్లెయిర్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు.
ఇషా అంబానీ - ఆనంద్ పిరమల్ :ముకేశ్ అంబానీ ఏకైక కుమార్తె ఇషా అంబానీ, వ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను 2018 డిసెంబర్ 12న ముంబయిలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వివాహం రోజున ఇషా రూ.90 కోట్ల ఖరీదుచేసే అందమైన లెహంగాను ధరించింది. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లెహంగా! ఆమె వివాహ దుస్తులను నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ వేడుకలు ఉదయ్‌పుర్, , ఇటలీలోని లేక్ కోమో, ఇంకా ముంబయి నగరాల్లో నిర్వహించారు. గ్లోబల్ సూపర్ స్టార్లు ఈ వివాహం కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. వీరి వివాహం లేక్ పిచోలాలోని ఒక ప్రైవేట్ ద్వీపంలో జరిగింది. ఈ వివాహానికి అయిన ఖర్చు సుమారు రూ.700 కోట్లు.
సుశాంతో రాయ్ - సీమాంటో రాయ్ :దివంగత సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ కుమారులు సుశాంతో , సీమాంటో రాయ్ అన్నదమ్ముల వివాహం 2004 ఫిబ్రవరి 10, 2004 ఫిబ్రవరి 14 మధ్య జరిగింది. ఈ వివాహానికి అక్షరాలా రూ.554 కోట్లు ఖర్చు అయింది అని చెబుతారు. లఖ్‌నవూలోని సహారా స్టేడియంలో ఈ రెండు వివాహాలు జరిగాయి. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ తారలు, క్రీడా ప్రముఖులతో సహా 11,000 మంది అతిథులతో వారం రోజులపాటు జరిగాయి.
బ్రాహ్మణి రెడ్డి --రాజీవ్ రెడ్డి :కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి 2016లో అత్యంత ఘనంగా తన ఏకైక కుమార్తె బ్రాహ్మణిని, రాజీవ్ రెడ్డితో వివాహం జరిపించాడు. బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఈ వివాహం జరిగింది. ఈ వివాహ వేదిక విజయనగర సామ్రాజ్యం రాజధాని హంపి శిథిలాలను పోలి ఉండేలా రూపొందించారు. ఈ వివాహ ఖర్చు సుమారు రూ.500 కోట్లు.
సృష్టి మిట్టల్ - గుల్రాజ్ బెహ్ల్ :ఉక్కు వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్ తన కుమార్తె వివాహాన్ని బార్సిలోనాలో ఘనంగా చేశారు. ఈ వివాహానికి దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ వివాహం కోసం 200 మంది బట్లర్లు, వంటవాళ్ళను భారతదేశం, థాయ్‌లాండ్ నుంచి స్పెయిన్‌కు తీసుకు వెళ్ళారు. ఈ కార్యక్రమానికి హాజరైన 500 మంది అతిథులు గోప్యత అగ్రిమెంట్‌పై సంతకం చేశారు.
వనీషా మిట్టల్- అమిత్ భాటియా :బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా మిట్టల్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అమిత్ భాటియా వివాహం కూడా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాలలో ఒకటి. 2004లో వెర్సైల్స్‌లో జరిగిన ఈ ఆరు రోజుల వివాహ కార్యక్రమం ఫ్రాన్స్‌లోని వెర్సైల్స్ ప్యాలెస్‌లో జరిగింది.ఈ ప్యాలెస్‌లో ఇప్పటి వరకు జరిగిన ఏకైక ప్రైవేట్ కార్యక్రమం వనీషా మిట్టల్ వివాహం మాత్రమే. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌లో షారుఖ్ ఖాన్, ఆస్ట్రేలియన్ సింగర్ కైలీ మినోగ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు చేశారు. ఈ వివాహ ఖర్చు సుమారు రూ.240 కోట్లు.