Congress Slams SEBI Over RTI Rebuff :సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్, ఆమె కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు వెల్లడించలేమని సెబీ (SEBI) చేసిన ప్రకటనపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సెబీ ప్రకటన జవాబుదారీతనాన్ని పరిహాసం చేస్తోందని అని దుయ్యబట్టింది.
'సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌కు, ఆమె కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తుల, ఈక్విటీల వివరాలు ప్రభుత్వానికి, సెబీ బోర్డుకు తెలియవా? ఒక వేళ తెలిసి ఉంటే, ఆ వివరాలు వెల్లడించాలి' అని కోరుతూ, రిటైర్డ్ కమొడోర్ లోకేశ్ బాత్రా సమాచార హక్కు (స.హ.) చట్టం కింద సెబీకి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సెబీ స్పందిస్తూ ఆ సమాచారం వ్యక్తిగతమైనదని, అవి బయటకు వెల్లడిస్తే వ్యక్తిగత భద్రతను ప్రమాదంలోకి నెట్టినట్లు అవుతుందని పేర్కొంది. ఏయే తేదీల్లో మాధబి పురి బచ్ తమ ఆస్తుల వివరాలను సమర్పించారో తెలియజేయడానికి కూడా నిరాకరించింది. లోకేశ్ బాత్రా కోరిన సమాచారం ప్రజాప్రయోజనకర అంశం కాదని, ఒక వ్యక్తి గోప్యతకు భంగం కలిగించే అంశమని సెబీ పేర్కొంది. కాబట్టి స.హ. చట్టం-2005 సెక్షన్ 8(1)(జి), 8(1)(జె) కింద వాటిని అందజేయలేమని సెబీ స్పష్టం చేసింది.
జవాబుదారీతనం లేదా?
ఈ విషయంపై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జి జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ స్పందించారు. "సెబీ ఛైర్‌పర్సన్‌కి సంబంధించిన పలు వివాదాలు తలెత్తుతున్న సమయంలో, ఆమెకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి సెబీ నిరాకరించింది. ఈ చర్య అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అందించాలని కోరిన వ్యక్తి అభ్యర్థనను సెబీ తోసిపుచ్చి జవాబుదారీతనాన్ని, పారదర్శకతను అపహాస్యం చేస్తోంది" అంటూ జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.