తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సిమెంట్​లో​ మిగిలిన అన్నం, కూర కలిపితే బిల్డింగ్ డబుల్ స్ట్రాంగ్! వినూత్న పద్ధతి కనిపెట్టిన IIT పరిశోధకులు​! - MIXING FOOD WASTE IN CONCRETE

ఆహార వ్యర్థాలతో కాంక్రీట్‌‌కు అదనపు శక్తి- నిర్మాణాలకు రెట్టింపు బలం- ఐఐటీ ఇందౌర్ పరిశోధనలో వెల్లడి

Mixing Food Waste In Concrete
Mixing Food Waste In Concrete (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2025, 5:20 PM IST

Mixing Food Waste In Concrete :మధ్యప్రదేశ్‌లోని ఐఐటీ ఇందౌర్​కు చెందిన పరిశోధకులు కాంక్రీట్‌పై జరిపిన అధ్యయనంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంక్రీట్‌లో ఉండే హాని కలిగించని ఈ-కొలి బ్యాక్టీరియాతో ఆహార వ్యర్థాలను కలిపినప్పుడు, వారు ఒక పెద్ద మార్పును గమనించారు. ఆహార వ్యర్థాలను కలిపిన తర్వాత సదరు కాంక్రీట్ దృఢత్వం మరింత మెరుగు పడిందని పరిశోధకులు గుర్తించారు. ఆ కాంక్రీటు రెట్టింపు బలాన్ని సంతరించుకుందని తెలిపారు. దాని నుంచి కర్బన ఉద్గారాలు కూడా తక్కువ మోతాదులో విడుదలయ్యాయని చెప్పారు.

క్యాల్షియం కార్బోనేట్ స్ఫటికాలు ఏం చేస్తాయంటే?
"ఆహార వ్యర్థాలు కుళ్లిన తర్వాత, వాటిలో నుంచి కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. కాంక్రీట్‌లో ఉండే హాని కలిగించని ఈ-కొలి బ్యాక్టీరియాతో ఈ ఆహార వ్యర్థాలను కలపగానే వాటి మధ్య పరస్పర చర్య మొదలవుతుంది. ఆహార వ్యర్థాల నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, వెంటనే కాంక్రీట్‌లోని క్యాల్షియం అయాన్లతో కలిసిపోతుంది. ఫలితంగా క్యాల్షియం కార్బోనేట్ స్ఫటికాలు ఏర్పడతాయి" అని ఐఐటీ ఇందౌర్ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ సందీప్ చౌదరి వివరించారు.

ఈ క్యాల్షియం కార్బోనేట్ స్ఫటికాలన్నీ కలిసి కాంక్రీట్‌లో ఉండే రంధ్రాలు, పగుళ్లను నింపుతాయి. దీనివల్ల ఏ మాత్రం బరువు పెరగకుండానే, కాంక్రీట్ శక్తి మరింత పెరుగుతుంది. ప్రయోగంలో భాగంగా కాలీఫ్లవర్ రెమ్మలు, బంగాళాదుంప పొట్టు, మెంతికూర కాడలు, ఆరెంజ్ తొక్కలు, బొప్పాయి గుజ్జులకు సంబంధించిన వ్యర్థాలను కాంక్రీట్‌లో కలిపినట్లు సందీప్ చెప్పారు.

"ఆహార వ్యర్థాలను కాంక్రీట్‌లో కలిపే ముందు, వాటిలో ఉన్న నీటి మోతాదుపై మేం ఒక స్పష్టమైన అంచనాకు వస్తాం. తక్కువ తేమ కలిగిన ఆహార వ్యర్థాలను పౌడర్‌గా మార్చేసి, నీటిలో కలిపాకే కాంక్రీట్‌లో మిక్స్ చేస్తాం. అత్యధిక తేమ కలిగిన ఆహార వ్యర్థాలను గుజ్జుగా మార్చేసిన తర్వాతే కాంక్రీట్‌లో వేస్తాం" అని ఆయన తెలిపారు. "కాంక్రీట్‌లో ఉండే హాని కలిగించని ఈ-కొలి బ్యాక్టీరియా ప్రత్యేకత ఏమిటంటే, అది నిర్ణీత దశ వరకే పెరుగుతుంది. కాంక్రీట్‌లోని పగుళ్లు, రంధ్రాలను పూడ్చే పని అయిపోగానే దాని పెరుగుదల ఆగిపోతుంది. దీనివల్ల నిర్మాణానికి ఎలాంటి నష్టమూ వాటిల్లదు" అని సందీప్ పేర్కొన్నారు.

పాత పద్ధతి వేస్ట్!
"బ్యాక్టీరియాతో పాటు సింథటిక్ రసాయనాలను కాంక్రీట్‌లో కలిపే పాత పద్ధతి వేస్ట్. అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా ప్రయోజనం తక్కువ" అని ఐఐటీ ఇందౌర్ బయోసైన్స్ అండ్ బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ హేమచంద్ర ఝా తెలిపారు. "మేం ఈ ప్రయోగంలో సింథటిక్ రసాయనాల స్థానంలో ఆహార వ్యర్థాలను వాడాం. దీనివల్ల ఖర్చు బాగా తగ్గిపోయింది. ఆహార వ్యర్థాలు నీటిలో కలిసిపోయి, సులభంగా కాంక్రీట్‌తో మిక్స్ అవుతాయి" అని ఆయన చెప్పారు.

మండుటెండల్లోనూ మీ ఇల్లు చల్లగా! - ఈ చిట్కాలతో మీ గదిని చల్లబరుచుకోండి!

ప్లాస్టిక్ బాటిళ్లలతో అందమైన ఇల్లు- 85వేల సీసాలతో ఇలా కట్టేశారు!

ABOUT THE AUTHOR

...view details