Mission Divyastra In India :మిషన్ దివ్యాస్త్ర పేరుతో ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ). స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (MIRV) సాంకేతికతతో పదేళ్లు శ్రమించి డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది.
ప్రాజెక్ట్‌లో అనేక మంది మహిళలు!
ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం MIRV సాంకేతికత కలిగిన అగ్ని-5 క్షిపణి సొంతం. ఒకే క్షిపణి దాదాపు 10 వార్‌హెడ్ల వరకు మోసుకెళ్లగలదు. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. దేశీయంగానే ఎంఐఆర్‌వి సాంకేతికతను డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక మహిళ అని, ఇందులో అనేక మంది మహిళల పాత్ర ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇటీవలే తెలిపాయి. MIRV సాంకేతికత ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, ఫ్రాన్స్ దేశాల వద్ద ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరింది.