Migrant Labours Killed In Kashmir :జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కార్మికులు చనిపోయినట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఒకరు ఘటనాస్థలంలోని మృతిచెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు చెప్పారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదులు ఈ ఏడాది టార్గెట్ చేసిన చంపిన తొలి ఘటనగా పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మరణించిన వారిని పంజాబ్‌లోని అమృత్ సర్‌కు చెందిన అమృత్‌పాల్ సింగ్, రోహిత్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన యువకులిద్దరూ ఒకే గ్రామానికి చెందిన స్నేహితులు. దీంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమృతపాల్ సింగ్, రోహిత్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఖండించిన ఫరూక్, ఒమర్
శ్రీనగర్‌లో స్థానికేతరులపై జరిగిన దాడిని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా ఖండించారు. "శ్రీనగర్‌లోని షాల్ కదల్లో కార్మికుల ప్రాణాలను ఉగ్రవాదులు బలిగొన్న అనాగరిక ఘటన తెలిసి ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతికి లోనయ్యారు. వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నారు" అని నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.
మన సమాజంలో హింసకు స్థానం వద్దు!
'మన సమాజంలో హింసకు స్థానం ఉండకూడదని, ఇలాంటి అనాగరిక చర్యలు మనం పోరాడుతున్న పురోగతికి విఘాతం కలిగిస్తాయ'ని ఎన్సీ పార్టీ చెప్పింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సైతం ఈ దాడిని ఖండించింది. గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది. పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకుడు సజాద్ లోన్ కూడా దాడిని ఖండించారు.
గతేడాది అనంత్‌నాగ్, షోపియాన్ జిల్లాల్లో స్థానికేతర కార్మికులపై ఉగ్రవాదులు అనేకసార్లు దాడులకు పాల్పడ్డారు. మే 30వ తేదీ అనంత్‌నాగ్ జిల్లాలో సర్కస్ కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. బిహార్‌కు చెందిన ఇటుక బట్టి కార్మికుడు ముకేశ్ కుమార్‌ను అక్టోబర్ 31న పుల్వామా జిల్లాలో కాల్చి చంపారు. జులై 13న షోపియాన్ జిల్లాలోని గాగ్రెన్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు కూలీలు గాయపడ్డారు.