Mamata Banerjee On Congress : 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావడం అనుమానమే అని బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 48 రోజుల దీక్ష చేపట్టిన మమత ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
వారివి బుజ్జగింపు రాజకీయాలు!
దేశంలోని 300 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌కు తాము చెప్పినట్లు మమతా బెనర్జీ తెలిపారు. ప్రాంతీయ పార్టీలు 243 సీట్లలో పోటీ చేస్తాయని పేర్కొన్నట్లు వెల్లడించారు. 'ఎవరికి ఎక్కడ బలం ఉంటుందో అక్కడ వారు పోరాడాలని చెప్పాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బంగాల్‌కు వచ్చి ఇక్కడి ముస్లిం ఓట్లు, బీజేపీ హిందువుల ఓట్లను రాబట్టేలా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి. కానీ మేము మాత్రం హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవుల కోసం పని చేస్తున్నాం' అని మమతా చెప్పారు.
'కాంగ్రెస్ 300కి 40 సీట్లు గెలుస్తుందో లేదో నాకు తెలియదు. కానీ అంత అహంకారం ఎందుకు మీకు. రాహుల్ గాందీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బంగాల్‌కు వచ్చారు. ఆ విషయం నాకు తెలియదు. ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. మనం ఇండియా కూటమిలో ఉన్నాం. అయినా నాకు సమాచారం ఇవ్వలేదు. మీకు దమ్ముంటే వారణాసిలో బీజేపీని ఓడించండి. మీరు గతంలో గెలిచిన స్థానాల్లో ఈసారి ఓడిపోతారు.'
--మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి