Building Collapse Lucknow : ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. సుమారు 28 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం లఖ్‌నవూలో జరిగింది. పలువురు ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని, వారిని వెలికితేసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. గాయపడివారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లోని ఓ మూడంతస్తుల భవనంలో గిడ్డంగులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం 5 గటంల ప్రాంతంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని, సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతదేహాలను వెలకితీశారు.
ఇక శనివారమే ఘటనాస్థలికి చేరుకున్న డీసీపీ శశాంక్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మొదట్లో వర్షం కారణంగా బిల్డింగ్ కుప్పకూలినట్లు భావించారు. కానీ బిల్డింగ్ పిల్లర్‌కు క్రాక్ ఏర్పడడం వల్లనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు వెల్లడించారు.
''లఖ్‌నవూలో ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లోని హర్మిలాప్ భవనాన్ని నాలుగేళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఈ మూడంతస్తుల ఈ భవనంలో కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో మోటార్ వర్క్‌షాప్, మొదటి అంతస్తులో మెడికల్ గొడౌన్, రెండవ అంతస్తులో కత్తిపీట గొడౌన్ ఉన్నాయి. శనివారం వర్షం కురిసింది. అదే సమయంలో బిల్డింగ్ పిల్లర్‌కు క్రాక్ ఏర్పడింది. దీనితో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీనితో అందులో పని చేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని అధికారులు వివరాలు వెల్లడించారు.