Lok Sabha Election 2024 Phase 5 : లోక్సభఐదో దశ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాల్లో మే 20న పోలింగ్ జరగనుంది. ఈ ఐదో దశ ఎన్నికల్లో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 33 శాతం మంది కోటీశ్వరులు కాగా, ముగ్గురు అభ్యర్థుల ఆస్తులు కేవలం రూ.1000 మాత్రమే కావడం గమనార్హం. బరిలో ఉన్న అభ్యర్థుల్లో మహిళలు కేవలం 11.8 శాతమే ఉన్నారు.
రాజకీయ నాయకులు - ఆస్తులు
ఐదో దశలో రాహుల్ గాంధీ అభ్యర్థిగా ఉన్న రాయ్‌బరేలీతో పాటు అమేఠీలో పోలింగ్ జరగనుంది. మొత్తంగా 695 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ ఐదో దశ ఎన్నికల్లోనే తేలనుంది. ఈ 695 మంది అభ్యర్థుల్లో 33 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. ముగ్గురు అభ్యర్థుల ఆస్తులు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉండటం గమనార్హం. భాజపా నుంచి 40 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో 36 మంది కోటీశ్వరులే. ముగ్గురు భాజపా అభ్యర్థుల ఆస్తుల విలువ రూ.50 కోట్లకు పైమాటే. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ నుంచి 46 మంది పోటీలో నిలవగా, వారిలో 26 మంది కోటీశ్వరులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 18 మంది అభ్యర్థులు ఉండగా, అందులో 15 మంది కోటీశ్వరులు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మొత్తం 10 మంది అభ్యర్థులు కూడా కోటికిపైగా ఆస్తులు కలిగి ఉన్నారు.
పొలిటికల్ లీడర్స్ - క్రిమినల్ కేసులు
సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల్లో ఐదుగురిపై క్రిమినల్ కేసులు, నలుగురిపై అతి తీవ్రమైన నేరాల కేసులు ఉన్నాయి. 19 మంది భాజపా అభ్యర్థులకు నేర చరిత్ర ఉండగా, 12 మంది భాజపా అభ్యర్థులు తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో భాజపా అభ్యర్థి అరుణ్‌సింగ్‌పై ఏకంగా 93 క్రిమినల్ కేసులున్నాయి. నియోజకవర్గాల పరంగా చూస్తే యూపీలోని మోహన్‌లాల్‌గంజ్‌లో వివిధ పార్టీల అభ్యర్థులపై ఎక్కువ క్రిమినల్ కేసులున్నాయి. అయితే అమేఠీలో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థిపైనా ఒక్క క్రిమినల్ కేసు కూడా లేకపోవడం విశేషం. అమేఠీలో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది.