Parliament Session Sine Die :పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబరు 20తో ముగిశాయి. అదానీ అంశం, అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు తదితర అంశాలతో పార్లమెంట్ ఉభయ సభలు శీతాకాల సమావేశాల్లో అట్టుడికిపోయాయి.
లోక్‌సభ నిరవధిక వాయిదా
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమాన పరిచారంటూ ఇండియా కూటమి నేతలు శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం నిరసన చేపట్టారు. విపక్ష నేతల నిరసనకు పోటాపోటీగా ఎన్డీఏ ఎంపీలు సైతం ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. దీంతో సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
రాజ్యసభ నిరవధిక వాయిదా
విపక్షాల నిరసనల మధ్యే శుక్రవారం రాజ్యసభ సమావేశాన్ని మధ్యాహ్నం 12గంటలకు ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ వాయిదా చేశారు. సభలో ప్రతిష్టంభనను ముగించే ప్రయత్నంలో భాగంగా సభా నాయకుడు జేపీ నడ్డా, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సహా ప్రతిపక్ష పార్టీల నాయకులతో ధన్‌ఖడ్ భేటీ అయ్యారు. సభను సజావుగా సాగేలా చూడాలని వారిని కోరారు.
రాజ్యసభలో జమిలి ఎన్నికల తీర్మానం ఆమోదం
రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ ప్రారంభమైన తర్వాత జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును జేపీసీకి పంపేందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను జగ్దీప్ ధన్‌ఖడ్ కోరారు. ఈ తీర్మానం వాయిస్ ఓటుతో ఆమోదం పొందింది.
'అర్థవంతమైన చర్చలు జరగాలి'
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ పని చేసింది కేవలం 43 గంటల 27 నిమిషాలేనని ఛైర్మన్ ధన్‌ఖడ్ తెలిపారు. పార్లమెంటేరియన్లుగా తాము దేశ ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నామని వ్యాఖ్యానించారు. సమావేశాల నిరంతర అంతరాయాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసాన్ని క్రమంగా సన్నగిల్లేలా చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అర్థవంతమైన చర్చ జరగాలని కోరుతూ సభను నిరవధిక వాయిదా వేశారు.
జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు
విపక్ష సభ్యుల నిరసన మధ్యే లోక్‌సభ శుక్రవారం సమావేశమైంది. జమిలి ఎన్నికల ముసాయిదాను జేపీసీకి పంపాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను స్పీకర్ ఓం బిర్లా కోరారు. ఆ సమయంలో విపక్ష సభ్యులు 'జై భీమ్' 'జై భీమ్' అని నినాదాలు చేశారు. అయినప్పటికీ జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. కాగా, విపక్షాల నినాదాల మధ్యే ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఛాంబర్‌లోకి ప్రవేశించారు.
సభ్యులకు స్పీకర్ హెచ్చరిక
ఎంపీలు పార్లమెంటులో ప్రదర్శనలు, నిరసనలకు దిగితే చర్యలు తప్పవని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం హెచ్చరించారు. అంబేడ్కర్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానించారంటూ పార్లమెంటు ఆవరణలో అధికార, విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ఓం బిర్లా ఈ వ్యాఖ్యలు చేశారు.
"పార్లమెంట్ ఆవరణలో ఎక్కడైనా ప్రదర్శనలు లేదా నిరసనలు చేయొద్దు. అలా చేస్తే ఎంపీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు గేట్ల వద్ద ఎలాంటి నిరసనలు లేదా ప్రదర్శనలు నిర్వహించడం సరికాదు. ఈ విషయంలో మీరు నిబంధనలను పాటించాలి. ఈ హెచ్చరికను సీరియస్‌గా తీసుకోవాలని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను" అని స్పీకర్ ఓం బిర్లా లోక్ సభ నిరవధిక వాయిదాకు ముందు వ్యాఖ్యానించారు.
విపక్షాల ర్యాలీ
దిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ధర్నా చేపట్టారు. అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీగా వచ్చి తమ నిరసనను తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ సర్కార్ పై ప్రియాంక విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీపై కేసులు పెట్టడం బీజేపీ నైరాశ్యాన్ని తెలియజేస్తుందని ఎద్దేవా చేశారు.
రాహుల్‌ను విచారించే అవకాశం!
పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద గురువారం ఎన్డీఏ, ఇండియా కూటమి ఎంపీల మధ్య బాహాబాహీకి దారితీసిన ఘటనపై దుమారం తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. తమ ఎంపీలపై ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ దాడిచేశారని బీజేపీ, అధికార పార్టీ సభ్యులే తమపై దాడి చేశారంటూ కాంగ్రెస్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పార్లమెంట్ ఆవరణలోని పోలీసులు, వాటిని నేర విభాగానికి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
పార్లమెంట్ దగ్గర జరిగిన వివాదంలో గాయపడిన ఇద్దరు బీజేపీ ఎంపీల వాంగ్మూలాలను పోలీసులు శుక్రవారం నమోదు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పోలీసులు రాహుల్ గాంధీని విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలిపాయి. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని యాక్సెస్ చేయాలని కోరుతూ దిల్లీ పోలీసులు పార్లమెంట్ సెక్రటేరియట్‌కు లేఖ రాసే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి.