Maha Kumbh Mela 2025 :వసంత పంచమిని పురస్కరించుకుని ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. చలిని కూడా లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఉదయం 8 గంటలకు వరకు దాదాపు 62 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. మౌనీ అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటవంటి ఘటనలు పునరావృతం కాకుండా స్వయంగా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
చివరి అమృత స్నానం!
ప్రయాగ్‌రాజ్‌లో చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివచ్చారు. త్రివేణీ సంగమం హరహర మహాదేవ్ నినాదాలు మార్మోగింది. దాదాపు 10 లక్షల మంది నాగసాధువులు, సన్యాసులు అమృత స్నానాలు చేయగా, 52 లక్ష మంది సాధారణ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. త్రివేణీ సంగమం వద్ద భక్తులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు.
అఖాడా సాధువుల సాహి స్నాన్
అఖాడాల్లో మెుదట శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణికు చెందిన సాధువులు అమృత స్నానం ఆచరించారు. ఆ తర్వాత వివిధ అఖాడాలకు చెందిన సన్యాసులు అమృత స్నానం చేశారు. త్రివేణిసంగమం ప్రాంతానికి చేరుకునే ముందు సన్యాసులు గుర్రాలపై ర్యాలీగా తరలివచ్చారు. వారి మార్గంలోకి సాధారణ భక్తులు చొరబడకుండా ఉండేందుకు పోలీసులు రెండు వైపుల బారికేడ్లు ఏర్పాటు చేశారు. అమృత స్నానం ఆచరించే సమయంలో సాధువులు, సన్యాసులు హరహర మహాదేవ్ అంటూ నినదిస్తూ శివయ్య నామస్మరణతో ఘాట్లన్నీ మార్మోగాయి.
4-6 కోట్ల మంది భక్తులు!
వసంత పంచమిని పురస్కరించుకొని 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తారని అంచనా వేసిన ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మౌనీ అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కుంభమేళా ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేసింది. ఎటువంటి తప్పిదం జరగకుండా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులను రంగంలోకి దింపింది.
పరమ పవిత్రం-మోక్షానికి మార్గం
మహాకుంభమేళాలో అమృత్ స్నాన్‌ను అత్యంత పవిత్రంగా భావిస్తారు. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు పోవటమే కాకుండా మోక్షానికి మార్గం లభిస్తుందని విశ్వసిస్తారు. మొత్తం 3అమృత్ స్నానాల్లో ఇప్పటికే రెండు ముగిశాయి. వసంత పంచమి సందర్భంగా చివరి సాహి స్నాన్ జరగుతోంది. మూడు అమృత్ స్నానాలే కాకుండా మరో మూడు ప్రధాన స్నానాలు జరగనున్నాయి. అందులో ఒకటి జనవరి 13 పుష్య పూర్ణిమ స్నానం పూర్తి కాగా, ఈనెల 12న మాఘ పూర్ణిమ, 26న మహాశివరాత్రి పుణ్యస్నానాలు జరగాల్సి ఉంది.
మహాకుంభ మేళాలో అమృత స్నానం చేస్తున్న మహిళలు (ETV Bharat) మహాకుంభ మేళాలో విదేశీ భక్తులు (ETV Bharat)