Mallikarjuna Kharge Letter :లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ నిరాశతో ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రధాని మోదీ ద్వేషపూరిత ప్రసంగాలకు బదులు గత పదేళ్లలో ఎన్డీఏ సర్కార్ పనితీరు ఆధారంగా ఓట్లు అడగడం మంచిదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. అందులో ప్రధానికి ఖర్గే పలు ప్రశ్నలు సంధించారు.
"మీ ఎన్నికల ప్రసంగాల్లో అబద్ధాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు లేఖ రాసి మీ అబద్ధాలను మరింత విస్తరించాలని కోరుకుంటున్నారు. ఒక అబద్ధాన్ని వెయ్యి సార్లు పునరావృతం చేసినా అది నిజం అయిపోదు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఏ హామీలిచ్చిందో చదివి ఓటర్లు అర్థం చేసుకోగలరు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు తొలగించి మా ఓటు బ్యాంకుకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్డీఏ అభ్యర్థులకు మీరు లేఖ రాశారు. ప్రతీ భారతీయుడు మా ఓటు బ్యాంకే. ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం వల్ల మీరు ఆందోళన చెందుతున్నారు. మీ విధానాల పట్ల ప్రజలు ఆసక్తిగా లేరు. ఎన్నికలు ముగిశాక ప్రజలు మిమ్నల్ని విభజన, మతతత్వ ప్రసంగాలు చేసిన ప్రధానిగా మాత్రమే గుర్తుంచుకుంటారు."
-- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
'వాటి గురించి మాట్లాడడానికి ఆసక్తి చూపరు'
దేశంలో ఉన్న అసమానతలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల గురించి మాట్లాడటానికి ప్రధాని మోదీ ఆసక్తి చూపడం లేదని ఖర్గే ప్రశ్నించారు. 1947 నుంచి ప్రతి దశలోనూ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారని ఎవరో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. "కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా చెబుతున్నారు. గత పదేళ్లలో మేం చూసిన ఒకే ఒక్క బుజ్జగింపు విధానం చైనాను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు బుజ్జగించడమే. పదేపదే చైనా అతిక్రమణలు, అరుణాచల్ ప్రదేశ్, లద్ధాఖ్, ఉత్తరాఖండ్‌లోని ఎల్ఏసీ సమీపంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, చైనా వస్తువుల దిగుమతులు గత ఐదేళ్లలో 54.76 శాతం ఎగబాకాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రకారం జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి. రాజ్యాంగ విరుద్ధమైన ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా బీజేపీ అన్యాయంగా రూ.8,250 కోట్లు కూడబెట్టింది" అని ఖర్గే మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.