Kejriwal On PM Post : ఇండియా కూటమి గెలిస్తే దేశానికి ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశమేదీ తనకు లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించడమే తన ఏకైక లక్ష్యమని ఆయన తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కలిసి ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తాయని చెప్పారు. "మాది చాలా చిన్న పార్టీ. కేవలం 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. ప్రధాని పదవిని మేం ఆశించడం లేదు" అని ఆప్ చీఫ్ స్పష్టం చేశారు.
300 లోక్‌సభ సీట్లు పక్కా!
విపక్ష కూటమికి ఈ ఎన్నికల్లో దాదాపు 300 లోక్‌సభ సీట్లు వస్తాయని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిగా అంగీకరిస్తారా అని అడిగిన ప్రశ్నకు కేజ్రీవాల్, "ఇప్పటిదాకా ఆ అంశంపై చర్చ జరగలేదు. ఇది సైద్ధాంతిక ప్రశ్న. మేం కలిసి కూర్చున్నప్పుడు చర్చిస్తాం" అని బదులిచ్చారు. ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
'ఇండియా గెలవగానే నాకు విడుదల'
జూన్ 5న ఇండియా కూటమి అధికారంలోకి వస్తే న్యాయవ్యవస్థకు తీవ్ర ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుందని కేజ్రీవాల్ అన్నారు. తనపై ఉన్న కేసులన్నీ బోగస్‌వే అని ఆయన చెప్పారు. "నాపై పెట్టిన కేసుల్లో ఎక్కడా డబ్బుల జాడ లేదు. అవినీతి జరిగితే ఆ డబ్బు ఎక్కడికి పోయింది?" అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ప్రతిపక్ష కూటమి గెలిస్తే జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే తాను స్వేచ్ఛగా ఉంటానన్నారు. "అధికారంలోకి వచ్చాక మేం న్యాయవ్యవస్థపై ఎలాంటి ఒత్తిడి చేయబోం. న్యాయవ్యవస్థపై ఒత్తిడి లేకుండా చేస్తే సరిపోతుంది. న్యాయం దానంతట అదే జరిగిపోతుంది" అని ఆప్ చీఫ్ పేర్కొన్నారు.
సునీతకు రాజకీయాలపై ఆసక్తి లేదు!
తన సతీమణి సునీతకు రాజకీయాలపై ఆసక్తి లేదని, భవిష్యత్తులో ఆమె ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేదని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. సునీత లాంటి జీవిత భాగస్వామి లభించడం తన అదృష్టమని ఆయన అన్నారు. తనలాంటి విపరీతమైన వ్యక్తిని తట్టుకోవడం అంత సులభం కాదని పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో దిల్లీలోని మురికివాడల్లో పని చేసేందుకు, తాను ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ పోస్టుకు రాజీనామా చేసిన సందర్భాన్ని కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు.