తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారితో కలిసి కేజ్రీవాల్​ కుట్ర- లిక్కర్​ స్కామ్​లో అరెస్ట్​ చట్టబద్ధమే'- దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు - Kejriwal ED Arrest Delhi High Court - KEJRIWAL ED ARREST DELHI HIGH COURT

Kejriwal ED Arrest Delhi High Court : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) అరెస్టును సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ దాఖలు చేసిన పిటిషన్​పై దిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈడీ సేకరించిన ఆధారాలు ద్వారా, ఇతరులతో కలిసి అరవింద్​ కేజ్రీవాల్​ కుట్రపన్నారని తెలుస్తోందని తెలిపింది. కేజ్రీవాల్​ వ్యక్తిగతంగా, ఆప్​ కన్వీనర్​ హోదాలో కుంభకోణంలో పాలుపంచుకున్నారని చెప్పింది. ఈడీ అరెస్టు, రిమాండు చేయడం చట్టబద్ధమే అని తేల్చింది.

Kejriwal ED Arrest Delhi HC
Kejriwal ED Arrest Delhi HC

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 4:01 PM IST

Updated : Apr 9, 2024, 5:27 PM IST

Kejriwal ED Arrest Delhi High Court :దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) అరెస్టును సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ దాఖలు చేసిన పిటిషన్​పై దిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈడీ అరెస్టు, ఆ తర్వాత రిమాండుకు తరలించడం చట్ట విరుద్ధం కాదని తేల్చింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనులు విన్న జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ధర్మాసనం, ఈడీ సేకరించిన ఆధారాలు ద్వారా, ఇతరులతో కలిసి అరవింద్​ కేజ్రీవాల్​ కుట్రపన్నారని తెలుస్తోందని అభిప్రాయపడింది. కేజ్రీవాల్​ వ్యక్తిగతంగా, ఆప్​ కన్వీనర్​ హోదాలో కుంభకోణంలో క్రియాశీలకంగా పాలుపంచుకున్నారని చెప్పింది. అంతేకాకుండా ఇతర నిందితులు అప్రూవర్​లుగా మారడంపై కేజ్రీవాల్​ లేవనెత్తిన అభ్యంతరాన్ని కోర్టు తప్పుబట్టింది. అప్రూవర్​ను క్షమించడం ఈడీ పరిధిలో లేదన్న కోర్టు అది న్యాయ ప్రక్రియని తెలిపింది. అప్రూవర్​లకు క్షమాపణ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, న్యాయమూర్తిపై అనుమానాలు లేవనెత్తినట్టేనని మందలించింది. కేజ్రీవాల్​ దర్యాప్తునకు సహకరించకపోవడం, ఆయన వల్ల జరిగిన జ్యాప్యం కూడా జ్యుడీషియల్​ కస్టడీలో ఉన్నవారిపై ప్రభావం చూపుతోందని కోర్టు తెలిపింది.

'సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవు'
తీర్పు సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. "సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదు. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు. కేజ్రీవాల్‌ అరెస్టు, రిమాండ్‌ చట్టవిరుద్ధం కాదు" అని వ్యాఖ్యానించింది.

అరవింద్​ కేజ్రీవాల్​ తరఫున సీనియర్​ అడ్వకేట్​ అభిషేక్​ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్​వీ రాజు వాదించారు. అయితే ఈడీ పీఎమ్​ఎల్​ఏ సెక్షన్​ 50ను ఫాలో కాలేదని, ఈ కేసులో ఇతర నిందితులు రాఘవ్​ మాగుంట, శరత్​ రెడ్డి, మాగుంట రెడ్డిని కేజ్రీవాల్​కు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చేలా బలవంతం చేసిందని వాదించారు. దీనికి స్పందించిన ఈడీ, మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్​ ప్రధాన వ్యక్తి అని, కీలక కుట్రదారు అని వాదనలు వినిపించింది. కేజ్రీవాల్​ మనీలాండరింగ్​ను పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పింది.

సుప్రీం కోర్టుకు వెళతాం : ఆప్
దిల్లీ హైకోర్టు తీర్పును కేజ్రీవాల్​ సుప్రీం కోర్టులు సవాల్​ చేయనున్నట్లు ఆప్​ వర్గాల సమాచారం. మద్యం కుంభకోణం కేసు మనీలాండరింగ్​ కోసం కాదని, మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు జరిగింది దేశంలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర అని ఆప్​ నేత, దిల్లీ మంత్రి సౌరభ భరద్వాజ్​ అన్నారు. ' మేము ఈ తీర్పుతో అంగీకరించడం లేదు. సుప్రీం కోర్టుకు వెళతాం. మాకు అత్యున్నత ధర్మాసనంపై చాలా నమ్మకం ఉంది. సుప్రీం కోర్టు సంజయ్​ సింగ్​కు బెయిల్​ మంజూరైంది. అదే విధంగా కేజ్రీవాల్​కు కూడా ఊరట లభిస్తుంది' అని సౌరభ్​ అన్నారు.

ఆప్​పై భగ్గుమన్న బీజేపీ
ఈ తీర్పును బీజేపీ స్వాగితించింది. అరవింద్​ కేజ్రీవాల్​ అవినీతి పరుడు, ఆయన జైల్లోనే ఉంటారని బీజేపీ నేత మంజిందర్ సింగ్​ సిర్సా అన్నారు. అరవింద్​ కేజ్రీవాల్​ ఒక క్రిమినల్​ అని, ప్రతి ఒక్కరూ దేశంలోని చట్టాలను ఫాలో అవ్వాలని బీజేపీ ఎంపీ మనోజ్​ తివారీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఈరోజు ఆప్​ గ్యాంగ్​ లీడర్​ ఫేస్​ను దిల్లీ హైకోర్టు ఆయనకే అద్దంలో చూపించింది. ఈడీ సేకరించిన ఆధారాలు ద్వారా ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్​ అని వెల్లడైంది. ఆప్​ వైఖరి బహిర్గతమైంది' అని అన్నారు. ఆమ్​ ఆద్​మీ పార్టీ అహంకారం తునాతునకలైపోయిందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు. (కేజ్రీవాల్​) స్వయం ప్రకటిత నిజాయితీ పాత్ర కూడా వాస్తవాలు, ఆధారాల ద్వారా విచ్ఛిన్నమైందని విమర్శించారు.

ఇదీ కేసు
మద్యం కుంభకోణం కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీకి తీసుకొని విచారించింది. ఏప్రిల్‌ 15 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఆయన తిహాడ్‌ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన అరెస్టును సవాల్‌ చేస్తూ మధ్యంతర ఉపశమనం కల్పించాలని కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తాజాగా తీర్పు వెల్లడించింది.

Last Updated : Apr 9, 2024, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details