How To Make Temple Style Katte Pongali:కట్టె పొంగలి.. ఈ పేరు వింటేనే చాలా మందికి నోరూరుతుంది. కారణం.. ఘుమఘుమలాడే వాసనతో.. అద్భుతమైన టేస్ట్‌ను కలిగి ఉంటుంది. ఇక గుడిలో పెట్టే ఈ ప్రసాదానికి కూడా ఫ్యాన్స్ ఎక్కువే. అంతేనా పండగలప్పుడు చాలా మంది ఇంట్లో కూడా చేసుకుంటుంటారు. మరికొంతమంది ఉదయం టిఫెన్లాగ కూడా తింటుంటారు. అయితే ఎన్నిసార్లు ఇంట్లో ఈ రెసిపీ చేసినా ఎదో మిస్ అయినట్లు అనిపిస్తుంది కానీ గుడిలో చేసిన టేస్ట్ మాత్రం రాదు. కాబట్టి ఈసారి కట్టె పొంగలి చేసేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే గుడిలో పెట్టే ప్రసాదాన్ని మించిన టేస్ట్ వస్తుందని నిపుణులు అంటున్నారు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- పెసరపప్పు - 1 కప్పు
- బియ్యం - 1 కప్పు
- వాటర్ - 6 కప్పులు
- బటర్ - పావు కప్పు
- నెయ్యి - ముప్పావు కప్పు
- మిరియాలు - 1 టేబుల్‌స్పూన్
- అల్లం తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- పచ్చిమిర్చి - 8
- జీలకర్ర - అర టేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి - 4
- జీడిపప్పు పలుకులు - అర కప్పు
- కరివేపాకు - కొద్దిగా
- ఇంగువ - పావు టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం :
- కట్టె పొంగలి తయారు చేయడానికి ముందుగా స్టౌపై పాన్ పెట్టుకొనిపెసరపప్పు(Pesarapappu)ను లో ఫ్లేమ్ మంట మీద 8 నుంచి 10 నిమిషాల పాటు దోరగా వేయించుకుని ఓ బౌల్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత వేయించిన పెసరపప్పులో బియ్యాన్ని పోసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ బియ్యాన్ని, పప్పను నీరు పోసి నానబెట్టాల్సిన అవసరం లేదు. కేవలం కడిగితే సరిపోతుంది. అలాగే పెసరపప్పును ఏ కప్పుతో తీసుకున్నారో.. అదే కప్పుతో బియ్యం, వాటర్‌ను తీసుకోవాలి.
- అనంతరం స్టౌపై ఒక బౌల్ పెట్టుకొని అందులో 6 కప్పుల వాటర్ పోసుకొని మూతపెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మరిగించుకోవాలి.
- ఈలోపు మరో స్టవ్ మీద కుక్కర్ పెట్టి బటర్ వేసుకోవాలి. అది కరిగాక ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యం మిశ్రమాన్ని వేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల పొంగలికి కమ్మటి వాసన, మంచి రుచి వస్తుంది.
- అది వేగిన తర్వాత.. మరుగుతున్న వాటర్ పోసి కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసి కలిపి మూతపెట్టుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- అలా ఉడికించుకున్న తర్వాత.. కుక్కర్లోని ప్రెజర్ పోయాక మూత తీసి ఓసారి కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ సరిపోలేదనుకుంటే కాస్త వేడి నీరు పోసుకుని కాసేపు బాయిల్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కుక్కర్‌ను మూత తీసి స్టవ్ మీద పెట్టి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించుకోవాలి. అలా చేయడం వల్ల అందులో ఉండే అదనపు వాటర్ గుంజుకుంటుంది.
- ఇప్పుడు తాలింపు కోసం వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగాక మిరియాలు, అల్లం తరుగు, జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి.
- అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక.. అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. అంటే.. జీడిపప్పులు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది.
- ఆ తర్వాత అందులో కరివేపాకు, ఇంగువ వేసి ఒకసారి కలిపి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
- అనంతరం ఆ తాలింపును మరో బర్నర్ మీద ఉడికిస్తున్న పొంగలిలో వేసుకొని కలుపుకోవాలి. ఆపై దాన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే "కమ్మనైన కట్టె పొంగలి" రెడీ!