Karnataka Minister Racist Comments On HD Kumaraswamy : కేంద్రమంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామిపై కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. జమీర్ అహ్మద్- కాలీయ (నలుపు రంగు) కుమారస్వామి బీజేపీ కన్నా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేగాయి. జమీర్ చేసిన జాత్యంహకార వ్యాఖ్యలను జేడీఎస్, బీజేపీ తీవ్రంగా ఖండించాయి. ఆయనను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశాయి.
'రంగు' వివాదం
ఇటీవల సీపీ యోగీశ్వర అనే కాంగ్రెస్ నేత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ తిరిగి ఆయన కాంగ్రెస్ గూటికే చేరారు. ఈ అంశంపై మాట్లాడిన జమీర్, "మా పార్టీలో ఉన్న అభిప్రాయ భేదాల వల్ల యోగీశ్వర స్వతంత్రంగా పోటీలో నిలబడ్డారు. కానీ తరువాత వేరేదారిలేక బీజేపీలో చేరారు. కానీ అక్కడ ఇమడలేక తిరిగి సొంతగూటికి చేరారు. అయితే 'కాలీయ (నలుపు రంగు) కుమార స్వామి బీజేపీ కన్నా ప్రమాదకారి. అందుకే యోగీశ్వర జేడీఎస్ పార్టీలోకి వెళ్లలేదు" అని వ్యాఖ్యానించారు.
'రంగు' గురించి జమీర్ మాట్లాడడంపై జేడీఎస్ తీవ్రంగా స్పందించింది. జమీర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసింది. 'కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, హెచ్‌సీ మహదేవప్ప, ప్రియాంక్ ఖర్గే ఏ రంగులో ఉన్నారో చెప్పాలని నిలదీసింది'.