Karnataka Congress Protest :రాష్ట్ర, కన్నడిగుల ప్రయోజనాలను కాపాడడమే తమ ప్రధాన ఉద్దేశమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. పన్నుల వాటా పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై కర్ణాటక కాంగ్రెస్ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, కేంద్రం తమకు కేటాయించాల్సిన అన్ని నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్ధరామయ్య నేతృత్వంలో చేపట్టిన ఈ ఆందోళనకు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా పన్నుల వాటా పంపిణీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్లో అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
"దేశంలో అధికంగా పన్నలు చెల్లించే రాష్ట్రాల్లో మొదట మహారాష్ట్ర ఉంటే, కర్ణాటకది రెండో స్థానం. ఈ ఏడాది సుమారు రూ.4.30లక్షల కోట్లు పన్నుల రూపంలో కట్టాం. మేము కేంద్రానికి రూ.100 ట్యాక్స్ కడితే, ప్రభుత్వం తిరిగి మాకు కేవలం రూ.12-13 మాత్రమే చెల్లిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మా నిరసనను పరిశీలిస్తుందని అనుకుంటున్నాం. కన్నడిగుల, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడమే మా ప్రధాన ఉద్దేశం. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా మాతో కలిసి రావాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతెత్తాలి."
--సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి