Kailash Gahlot Ed Summons :దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆప్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ను అరెస్ట్ చేసిన ఈడీ తాజాగా మరో మంత్రి కైలాస్ గహ్లోత్‌కు నోటీసులు పంపింది. శనివారం విచారణకు హాజరుకావాలని సూచించింది. దీంతో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
నజఫ్‌గడ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కైలాస్ గహ్లోత్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో రవాణా, హోం, న్యాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. దిల్లీ మద్యం కేసులో దిల్లీ మంత్రి కైలాస్ గహ్లోత్‌ను ప్రశ్నించటంతోపాటు ఆయన వాంగ్మూలం నమోదు చేసేందుకు సమన్లు పంపినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
మొబైల్ నంబర్లు మార్చిన కైలాస్
కాగా, దిల్లీ ప్రభుత్వం రూపొందించిన 2021-22 మద్యం పాలసీ విధాన రూపకల్పన, అమలు కోసం చేసిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌లతో పాటు కైలాస్ కూడా ఉన్నారు. మద్యం పాలసీ ముసాయిదాను తయారు చేసే సమయంలో దిల్లీలోని కైలాస్ తన అధికారిక నివాసాన్ని అప్పటి ఆప్ కమ్యూనికేషన్ ఇన్చార్జ్ విజయ్ నాయర్‌కు ఉపయోగించుకునేందుకు అనుమతిచ్చారని ఈడీ పేర్కొంది. కైలాస్ తన మొబైల్ నంబర్లను సైతం మూడు సార్లు మార్చారని ఛార్జిషీట్లో ఆరోపించింది.