Jharkhand New CM Oath : ఝార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయీ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చంపయీ సోరెన్‌తో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా కూడా ప్రమాణం చేశారు. అనంతరం చంపయీ సోరెన్ బాధ్యతలు స్వీకరించారు.
మనీలాండరింగ్ కేసులో జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌పై ఈడీ విచారణ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఝార్ఖండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. జనవరి 31న హేమంత్‌ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఆ వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. అక్కడి కాసేపటికే సంకీర్ణ కూటమి తమ శాసనసభపక్ష నేతగా చంపయీ సోరెన్‌ను ఎన్నుకుంది. ఆ తర్వాత హేమంత్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం చకాచకా జరిగిపోయాయి.
ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుపైన కూడా కొన్ని గంటల పాటు సందిగ్ధం నెలకొంది. చివరకు చంపయీ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు గురువారం అర్ధరాత్రి గవర్నర్ నుంచి నిర్ణయం వెలువడింది. 10 రోజుల్లోగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఝార్ఖండ్ శాసనసభలో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 48 మంది సభ్యుల బలం ఉంది. ఫిబ్రవరి 5వ తేదీన చంపయా సోరెన్ ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకుంటుందని మంత్రి ఆలంగీర్ ఆలం తెలిపారు.
చంపయీ ప్రమాణస్వీకారం తర్వాత గవర్నర్ మీడియాతో మాట్లాడారు. "మేం ఎప్పుడూ ఒకటే ఆశిస్తాం. పేదలకు సేవ చేయాలి. వారి ప్రాథమిక అవసరాలు తీర్చాలి. మంచి రోడ్లు, మంచి తాగునీరు, మంచి పాఠశాలలు, మంచి ఆరోగ్య సంరక్షణ, మంచి ఇళ్లు అందించాలి. రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపడాలి. తద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది" అని చెప్పారు.
హైదరాబాద్‌కు ఎమ్మెల్యేల తరలింపు
బలపరీక్ష నేపథ్యంలో సంకీర్ణ కూటమి తమ సభ్యులను కాపాడుకునేందుకు సిద్ధమైంది. కొంతమంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలిస్తోంది. వాస్తవానికి గురువారమే వీరు హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. ప్రతిపక్ష బీజేపీ తమ ఎమ్మెల్యేలను ఎక్కడ తమవైపు ఆకర్షిస్తుందనే అనుమానాల నేపథ్యంలో జేఎంఎం, ఆర్జేడీ, కాంగెస్ కూటమి ఈ నిర్ణయం తీసుకుంది.
ఎవరీ చంపయీ సోరెన్?
చంపయీ సోరెన్ సెరైకెల్లా నియోజవకర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జేఎంఎంలో చేరకముందు ఆయన స్వతంత్ర ఎమ్మెల్యేగానూ ఎన్నికై సేవలందించారు. ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన చంపయీ సోరెన్ ఝార్ఖండ్ టైగర్‌గా పేరొందారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడు. 1956లో జిలింగోరా గ్రామంలో చంపయీ సోరెన్ జన్మించారు. మెట్రిక్యులేషన్ చదివారు. ఆయనకు ఏడుగురు పిల్లలున్నారు. శిబు సోరెన్‌తో ఎటువంటి బంధుత్వం లేదు.