Jayalalitha Gold Jewellery : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమంగా సంపాదించిన బంగారు, వజ్రాభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు కర్ణాటకలోని బెంగళూరు కోర్టు తేదీని నిర్ణయించింది. మార్చి 6,7 తేదీల్లో ఆ ఆభరణాలను తీసుకోవడానికి 6 ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును విచారించిన సివిల్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మార్చి 6,7 తేదీలను ప్రకటిస్తూ, ఆ రెండు రోజుల్లో ఇతర కేసుల విచారణ చేపట్టకూడదని నిర్ణయించారు.
'ఆ బంగారు ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని నియమించాం. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలి. ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు, అవసరమై భద్రత సిబ్బందితో వచ్చి బంగారు ఆభరణాలను తీసుకోవాలి. తమిళనాడు డిప్యూటీ ఎస్పీ ఈ విషయాన్ని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాలి. ఆ రోజుల్లో భద్రతకు స్థానిక పోలీసులను ఏర్పాటు చేసుకోనేలా చర్యలు తీసుకోవాలి' అని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం రూ.5కోట్లు ఖర్చు చేసిందని న్యాయవాది ఈటీవీ భారత్కు తెలిపారు. ఇందుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం రూ.5కోట్ల డీడీని కర్ణాటకకు ఇదివరకే అందించిందని చెప్పారు. అయితే, ఆ మొత్తం ఇంకా కర్ణాటక ఖజానాలో జమ అవ్వలేదని వివరించారు.