జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 59శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల ముఖ్య కమిషనర్ పీకే పోలె వెల్లడించారు. కిశ్త్‌వాడ్‌లో అత్యధికంగా 77శాతం, పుల్వామాలో అత్యల్పంగా 46శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. అన్ని చోట్లా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందన్న ఆయన, ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా తొలి దశలో 24 స్థానాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 24 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 23లక్షల మంది ఓటర్లు 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సెప్టెంబరు 25 రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
JKలో ప్రశాంతంగా తొలి విడత ఎన్నికలు- 59% పోలింగ్ నమోదు - Jammu Kashmir Elections - JAMMU KASHMIR ELECTIONS
Published : Sep 18, 2024, 6:43 AM IST
|Updated : Sep 18, 2024, 6:07 PM IST
Jammu and Kashmir Assembly Elections 2024 :జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, తొలి విడతలో 24 నియోజకవర్గాల్లో(కశ్మీర్లో 16, జమ్ములో 8) పోలింగ్ జరగుతోంది. ఈ తొలి విడత పోలింగ్‌లో త్రాల్, పాంపోర్, రాజ్‌పుర, పుల్వామా, శోపియాన్, జైనాపుర, కుల్గాం, డీహెచ్ పుర, దూరు, దేవ్‌సర్, అనంత్‌నాగ్ వెస్ట్, కోకెర్‌నాగ్, శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా, అనంత్‌నాగ్ కీలక నియోజకవర్గాలున్నాయి. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ప్రధానంగా ఈ ఎన్నికల బరిలోకి దిగాయి. ఎన్‌సీతో కాంగ్రెస్ జట్టు కట్టింది. ఆయా పార్టీల తరఫున 219 అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. 23 లక్షల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దైన తర్వాత జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే.
LIVE FEED
జమ్ముకశ్మీర్‌లో సాయంత్రం 5 గంటల వరకు 58.19 శాతం పోలింగ్ నమోదు
- జమ్ముకశ్మీర్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న తొలి విడత పోలింగ్
- సాయంత్రం 5 గంటల వరకు 58.19 శాతం పోలింగ్ నమోదు
జమ్ముకశ్మీర్‌లో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 50.65శాతం ఓట్లు పోలయ్యాయి.
ఒంటిగంట వరకు 41.17% ఓటింగ్
జమ్ముకశ్మీర్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం ఒంటిగంట వరకు 41.17% ఓటింగ్ నమోదైంది.
- అనంత్‌నాగ్-37.90%
- దోడా- 50.81%
- కిష్త్వార్-56.86%
- కుల్గాం-39.91%
- పుల్వామా-29.84%
- రాంబన్-49.68%
- శోపియాన్-38.72%
జమ్ముకశ్మీర్ ప్రజలారా, ఇండియా కూటమికి ఓటేయండి : రాహుల్
ఇండియా కూటమికే ఓటు వేయాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్ ప్రజలను కోరారు. ప్రతి ఓటు వారికి హక్కులను తిరిగి తీసుకువస్తుందని, ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని అన్నారు. "జమ్ముకశ్మీర్‌లోని నా అన్నాచెల్లెళ్లారా, ఈరోజు ఇక్కడ తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్రానికి, రాష్ట్రహోదా తొలగించారు. అనంతరం కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. ఇది మీకు రాగ్యాంగ ద్వారా లభించిన హక్కులను కాలరాయడమే. ఇది జమ్ముకశ్మీర్‌కు అవమానం. మీరు ఇండియా కూటమికి వేసే ప్రతి ఓటు మీ హక్కులను, ఉద్యోగాలను తీసుకువస్తుంది. మహిళలను శక్తిమంతంగా మార్చుతుంది. అన్యాయ కాలాన్ని తొలగించి జమ్ముకశ్మీర్‌ను మళ్లీ సుసంపన్నంగా మార్చుతుంది" అని రాహుల్ అన్నారు.
ఉదయం 11 గంటల వరకు 26.72% ఓటింగ్
జమ్ముకశ్మీర్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 26.72శాతం ఓటింగ్ నమోదైంది.
- అనంత్‌నాగ్-25.55%
- దోడా- 32.30%
- కిష్త్వార్-32.69%
- కుల్గాం-25.95%
- పుల్వామా-20.37%
- రాంబన్-31.25%
- శోపియాన్-25.96%
ఉదయం 9 గంటల వరకు 11.11% ఓటింగ్
భారత ఎన్నికల సంఘం ప్రకారం, జమ్ముకశ్మీర్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 11.11% ఓటింగ్ నమోదైంది.
ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయండి : మోదీ
జమ్ముకశ్మీర్‌లో తొలిదశ పోలింగ్ జరగుతున్నందున, ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు, పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుని ప్రజస్వామ్య పండుగను బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ముఖ్యంగా మొదటి సారి ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు, దృఢ సంకల్పం ఉన్న ప్రభుత్వం మాత్రమే ఉగ్రవాద రహిత జమ్ముకశ్మీర్‌ను సృష్టించగలదని కేంద్ర మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పౌరుల హక్కులను కాపాడుతుందన్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుందని చెప్పారు. "ఈరోజు జమ్ముకశ్మీర్‌లో తొలిదశ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ విడతలో ఓటు వేయబోతున్న ఓటర్లు నా విజ్ఞప్తి ఒక్కటే. విద్య, యువతకు ఉపాధి, మహిళా సాధికారత, ఆశ్రిత పక్షపాతాన్ని అంతం చేయడానికి, ఈ ప్రాంతంలో వేర్పాటు వాదాన్ని నిర్మూలించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉత్సాహంగా ఓటు వేయండి." అని అమిత్ షా అన్నారు.
ఇదిలా ఉండగా, 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు.
పోలింగ్ ప్రారంభం
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ బూత్‌ల ముందు క్యూ కట్టారు. అంతకుముందు అన్ని పోలింగ్ కేంద్రాల్లో అధికారులు మాక్ పోలింగ్‌ను నిర్వహించారు.
3,276 పోలింగ్ స్టేషన్స్, 1400 పోలింగ్ సిబ్బంది
Jammu and Kashmir Assembly elections 2024 :ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న వేళ జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ తొలి దశ పోలింగ్‌లో జరగనున్న 24 అసెంబ్లీ స్థానాల్లో 3,276 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అర్బన్‌లో 302, గ్రామీణ ప్రాంతాల్లో 2974 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. 14000 మంది పోలింగ్ సిబ్బందిని మోహరించారు.
ప్రముఖ అభ్యర్థులు - AICC ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, CPMకు చెందిన మహ్మద్ యూసుఫ్ తరిగామి, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన సకీనా ఇటూ, PDPకి చెందిన సర్తాజ్ మద్నీ, అబ్దుల్ రెహ్మాన్ ఉన్నారు.
ఏఏ పార్టీలు పోటీ చేస్తున్నాయంటే? - ప్రాంతీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ), పీపుల్స్ కాన్ఫరెన్స్(పీసీ), జమ్ముకశ్మీర్ పీపుల్స్ మూమెంట్(జేకేపీఎమ్), ఆప్నీ పార్టీతో పాటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఎన్నికల బరిలో దిగాయి. కాంగ్రెస్, ఎన్‌సీ కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా ఎన్‌సీ 51 సీట్లలో, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.