పంజాబ్-హరియాణా సరిహద్దు ప్రాంతం శంభు వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం మధ్యాహ్నం 'దిల్లీ చలో' మార్చ్‌ను ప్రారంభించిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించారు. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం 101 మంది అన్నదాతలు ఈ మార్చ్ చేపట్టారు.
అయితే, డిసెంబర్ 6వ తేదీ నుంచి అన్నదాతలు దిల్లీ వైపుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ రోజుతో కలిపి మూడోసారి వారి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. తాజా మార్చ్‌ను దృష్టిలోపెట్టుకొని హరియాణా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి 17వ తేదీ అర్ధరాత్రి వరకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.