Jaipur Ancient Ram Temple : రాజస్థాన్లోని జయపురలో ఉన్న ఓ రామాలయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయోధ్యలోని కనక్ భవన్ తరహాలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. శ్రీరాముడు తన సతీమణి సీతమ్మ, సోదరులు లక్ష్మణుడు, భరతుడు, శత్రుజ్ఞుడు కలిసి ఈ దేవాలయంలో కొలువుదీరారు. దాదాపు 130 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ గుడి అందమైన శిల్పకళతో చూపరులను ఆకట్టుకుంటోంది. అందుకే శ్రీరామనవమి పర్వదినంతోపాటు సాధారణ రోజుల్లో కూడా ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.
అద్బుతంగా శిల్పకళ
జయపుర వారసత్వ జాబితాలో శ్రీరాముడి ఆలయం ఇటీవలే చేరింది. ఈ ఆలయం ఉత్తర భారతదేశంలో ఉన్న పురాతమైన దేవాలయాల్లో ఒకటి. రాముడు తన సోదరులు, భార్యతో కలిసి ఉన్న ప్రతిమలను ఈ దేవాలయం నెలకొల్పారు. జయపురలోని పర్కోటా ప్రాంతంలోని చాంద్‌పోల్ బజార్‌లో ఉన్న ఈ శ్రీ రామచంద్రుని ఆలయ శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు శ్రీరాముడు తమను చూస్తున్నట్లుగా భావించే విధంగా ఇక్కడ దేవుడి విగ్రహం ఉంటుంది. అంతేగాక ఈ ఆలయానికి అయోధ్యతో కూడా ప్రత్యేక అనుబంధం ఉంది.
నిర్మాణానికి 20 ఏళ్లు
శ్రీరామనవమి వేడుకలు జయపురలోని రాముడి దేవాలయంలో ఏటా ఘనంగా జరుగుతాయి. రామయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూజారులు. శ్రీరామ నవమి నాడు స్వామిని ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ ఆభరణాలన్నీ రాజుల కాలం నాటివే. శ్రీరామనవమి వంటి పర్వదినాల్లో స్వామివారికి ఈ ఆభరణాలతో అలంకరిస్తారు. లాంతరు లేకుండా ఆలయ పైకప్పును అప్పట్లో నిర్మించారు. ఆలయ నిర్మాణంలో మక్రానా పాలరాతిని వాడారు. రామచరితమానస్‌లోని సంఘటనలు గుడి గోడలపై చెక్కారు. అందుకే ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది.