Jagan Mohan Reddy Vanpic Case :నీకది నాకిది అంటూ జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత కంపెనీల్లోకి ముడుపులు స్వీకరించిన కుంభకోణాల్లో వాన్‌పిక్ (Vanpic) కూడా ఒకటి. 2011 ఆగస్టు 17న FIR నమోదు చేసిన CBI 2012 ఆగస్టు 17న నిందితులపై అభియోగపత్రం దాఖలు చేసింది. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వాడరేవు, నిజాంపట్నం పోర్టులను జీ2జీ విధానంలో అభివృద్ధి చేయడానికి 2006 ఏప్రిల్ 10న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-ఇన్‌కాప్, చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన స్కోడా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ లిమిటెడ్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. దానికి అప్పుడు పెట్టిన పేరు నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ పోర్ట్ సిటీ కాంప్లెక్స్- నిప్‌కో! కానీ 2007 జులై 24న స్కోడా కంపెనీకి సాంకేతిక సామర్థ్యం లేదంటూ ఒప్పందాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత గల్ఫ్ దేశమైన రస్ అల్ ఖైమా-రాక్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
CM Jagan Illegal Assets Case : ప్రాజెక్టులో రాక్ ప్రభుత్వానికి 51%, ఏపీ ప్రభుత్వానికి 49% వాటాగా ఉంటుందని తొలుత చెప్పారు. ఒప్పంద కార్యక్రమానికి రాక్ రాజకుమారుడు హైదరాబాద్ వస్తున్నట్లు ప్రచారం చేశారు. కానీ ఆయన బదులు రాక్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ రాకియా సీఈఓ ఖతర్ మస్సాద్ వచ్చారు. అలా 2008 మార్చి 11న ఖతర్ మస్సాద్, ఏపీ ప్రభుత్వం (AP Government) తరఫున అప్పటి పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి కె.వి.బ్రహ్మానందరెడ్డి, నాటి మంత్రి మోపిదేవి వెంకట రమణ ఛాంబర్‌లో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని నిమ్మగడ్డ ప్రసాద్ అప్పుడు అక్కడే ఉన్నారు. ఆ తర్వాతే కథ కొత్తమలుపు తీసుకుంది.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ అలాస్యానికి కారణమెంటీ : సుప్రీం కోర్టు
ప్రాజెక్టు అమలు నిమిత్తం భారత్‌లో తమ భాగస్వామిగా మాట్రిక్స్ ఎన్‌పోర్ట్ హోల్డింగ్స్ వ్యవహరిస్తుందని ఖతర్ మస్సాద్ 2008 మార్చి 29న ప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పట్నుంచే ఏపీ ప్రభుత్వంతో రాక్ సంప్రదింపులన్నీ ఆగిపోయాయి. జీటూజీ పద్దతిలో ప్రభుత్వానికి-ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అమలు బాధ్యతలు ప్రైవేటు వ్యక్తైన నిమ్మగడ్డకు చెందిన మాట్రిక్స్ ఎన్‌పోర్ట్‌కు దక్కాయన్నమాట!. అంటే ఒప్పందంలోకి అనూహ్యంగా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రవేశించారు. ఓడరేవుల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టును పారిశ్రామిక కారిడార్‌గా మార్చేసి దానికి వాడరేవు, నిజాంపట్నం పోర్టు ఆధారిత పారిశ్రామికవాడ-వాన్‌పిక్ అని పేరు పెట్టారు.
ఏపీ ప్రభుత్వానికి మస్సాద్ లేఖ రాసిన రోజే రాకియా, నిమ్మగడ్డ కలిసి 3 ఒప్పందాలు కుదుర్చున్నారు. వాన్‌పిక్‌లో నిమ్మగడ్డకు 74%, రాక్‌కు 26% వాటాలు నిర్ణయించుకున్నారు. అంతేకాదు వాన్‌పిక్‌పై పూర్తి నియంత్రణ నిమ్మగడ్డకే దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగానే ముగ్గురు డైరెక్టర్లను నియమించే అధికారం నిమ్మగడ్డకు దక్కింది. పైగా ఈ ఒప్పందాల విషయం ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లలేదు. ఇక్కడ రాకియాతో ఒప్పందం తర్వాతే నిమ్మగడ్డ ప్రసాద్ ఇందులోకి ప్రవేశించినట్లు పైకి కనిపిస్తున్నా తెరవెనుక కథంతా ముందస్తు కుట్రతో నడిపారని సీబీఐ తేల్చింది. అదంతా ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచింది.
నిమ్మగడ్డ ప్రసాద్ తన సోదరుడు నిమ్మగడ్డ ప్రకాశ్‌తో కలిసి 2008 జనవరిలో మాట్రిక్స్ ఎన్‌పోర్ట్ హోల్డింగ్స్‌ను ఏర్పాటు చేశారు. YS ద్వారా లబ్ధిపొందిన ఇందూ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న ఏజె జగన్నాథన్‌ను రస్‌అల్‌ఖైమా ప్రభుత్వ సలహాదారుగా రంగంలోకి దించారు. ఏపీలో ఓడరేవుల ప్రాజెక్టు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రాక్ తరఫున లేఖ రాయించారు. దానికి ముసాయిదా MOU కూడా జత చేశారు. ఆ తర్వాతే తతంగం నడిపారు.
ఒప్పందంలోకి మ్యాట్రిక్స్ ప్రసాద్ వచ్చాక ప్రాజెక్టు పరిధిని అనూహ్యంగా 27 వేలకుపైగా ఎకరాలకు పెంచారు. ఫార్మా, విద్యుత్, మెరైన్, ఆగ్రో, ఆటో రంగాలకు చెందిన కారిడార్‌ను ఏర్పాటు చేయలేదు. నిజాంపట్నం, వాడరేవు పోర్టులు ఆర్థికంగా లాభదాయకం కాదనే సాకుతో వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ద్వారానే వాన్‌పిక్ ప్రాజెక్ట్ చేపడతామని 2008 మేలో ప్రభుత్వానికి లేఖ రాశారు. అదే ఏడాది జూన్‌లో వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాథమిక మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వానికి సమర్పించింది.
Jagan Illegal Assets: వాన్‌పిక్ కేసు.. జప్తు చేసిన భూముల విడుదల.. ఈడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
ఉమ్మడి గుంటూరులో 18వేల 696 ఎరాలు, ప్రకాశంలో 8వేల560 ఎకరాలు కలిపి మొత్తం 27వేల257 ఎకరాలు అవసరమని పేర్కొన్నారు. ఇన్నివేల ఎకరాల ప్రాజెక్టు ప్రతిపాదనను YS సర్కార్ కూలంకుషంగా పరిశీలించకుండా రోజుల వ్యవధిలోనే ప్రతిపాధనలను ఆమోదించింది. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి జూన్ 24న సంతకం చేయగా అదే నెల 30న మంత్రి మండలి ఆమోదానికి అజెండాలో చేర్చారు.
డ్రాఫ్ట్ మెమోరాండంలో వాడరేవు, నిజాంపట్నం ఓడరేవులు, పారిశ్రామికవాడ ప్రాజెక్టులన్నీ కలిపి వాన్‌పిక్ ప్రాజెక్ట్‌గా బిల్డ్ ఓన్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్-బూట్ పద్ధతిన చేపడతామని పేర్కొన్నారు. పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నోడల్ ఏజెన్సీగా ఉండాలని, ఒక్కో ఓడరేవుకు 2వేల ఎకరాల చొప్పున అవసరమని, గంగవరం, కృష్ణపట్నం ఒప్పందాల్లోని అంశాలకు అనుగుణంగా రాయితీలు కల్పించాలని వాన్‌పిక్ ప్రతినిధులు ప్రతిపాదించారు. కేబినెట్ భేటికి ఒక్కరోజు ముందు భూసేకరణపై అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో భూమిని తామే కొనుగోలు చేస్తామని, దీనికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. రాయితీ ఒప్పందాన్ని 2008 జూన్ 30న మంత్రిమండలి ఆమోదించింది. ఐతే అందులో బూట్ విధానం ఓడరేవులకు మాత్రమేనని, పారిశ్రామిక కారిడార్‌కు బిల్డ్ ఓన్ ఆపరేట్ విధానం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
వాన్‌పిక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అవసరమైన పట్టా భూముల సేకరణ నిమిత్తం భూసేకరణ కమిటీని ఏర్పాటు చేస్తూ నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి మన్మోహన్‌సింగ్ 2009 జూన్‌లో ఉత్తర్వులు ఇచ్చారు. కానీ వాన్‌పిక్ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వ ఆమోదం తెలపడానికి ముందే, అంటే 2008లోనే కంపెనీ ఉద్యోగుల పేరిట భూములను కొనుగోళ్లు ప్రారంభించారు. భూసేకరణ, అప్పగింతలో అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శామ్యూల్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏదైనా ప్రైవేటు కంపెనీ తమ అవసరాల నిమిత్తం భూమిని సేకరిస్తే భూముల యజమానులకు చెల్లించాల్సిన మొత్తం పరిహారాన్ని ఆ కంపెనీ రెవెన్యూ శాఖ వద్ద డిపాజిట్ చేయాలి.
తర్వాత రెవెన్యూ శాఖ అసలైన భూ యజమానులను గుర్తించి పరిహారం చెల్లిస్తుంది. వాన్‌పిక్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. నేరుగా రైతులకు చెల్లించడానికిప్రైవేటు కంపెనీకి అనుమతులు ఇచ్చారు. ఇలా 12వేల731 ఎకరాల భూమిని వాన్‌పిక్‌కు బదలాయించారు. వీటి కొనుగోలుకు 467 కోట్లు వెచ్చించినట్లు వాన్‌పిక్ రికార్డుల్లో చూపారు. ఇందులో గుడ్‌విల్, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఖర్చు కిందే 300 కోట్ల రూపాయలు చూపారు. అంటే 12వేల731 ఎకరాల కొనుగోలుకు వారు వెచ్చించింది 167 కోట్లు మాత్రమే.
OMC VANPIC PETITIONS: నిమ్మగడ్డ, వాన్‌పిక్ క్వాష్ పిటిషన్ల తీర్పు రిజర్వు
కారిడార్ అభివృద్ధి పేరుతో చిన్న రైతుల నుంచి బలవంతంగా పొందిన భూముల్లో నిమ్మగడ్డ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. ప్రభుత్వం ఎకరా సగటున 73 వేల రూపాయల ధర నిర్ణయించి అప్పగిస్తే నిమ్మగడ్డ ఏకంగా 12న్నర లక్షల చొప్పున విక్రయించుకుని లబ్ధి పొందారు. వాన్‌పిక్‌లో ఎలాంటి కార్యకలాపాలు మొదలు కాకుండానే ఎకరా 12న్నర లక్షల చొప్పున 87న్నర కోట్ల రూపాయలకు 700 ఎకరాల భూమిని కోస్టల్ సిరోహి లిమిటెడ్‌కు బదలాయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 4కోట్ల రూపాయలకుపైగా అడ్వాన్స్ తీసుకున్నారు. మరో 900 ఎకరాలను ష్యూ థర్మల్ పవర్ కార్పొరేషన్‌కు 99 ఏళ్ల లీజుతో 112న్నర కోట్ల రూపాయలకు నిమ్మగడ్డ ఒప్పందం చేసుకున్నారు. అదనంగా 400 ఎకరాలు తీసుకునేలా ఆ ఒప్పందంలో పేర్కొంటూ అడ్వాన్సుగా 16కోట్ల 88లక్షలు తీసుకున్నారు.
అలా వచ్చిన డబ్బును నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టుబడిగా పెట్టారు. జగన్‌కు చెందిన కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, అప్పటి రఘురాం సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, వైఎస్‌ఆర్ ఫౌండేషన్, సిలికాన్ బిల్డర్స్‌లలో పెట్టుబడులక సండూర్, భారతిలో వాటాల కొనుగోలుకు 854 కోట్లు మళ్లించారు. ఈ పెట్టుబడులు లాభదాయకం కాకపోయినా అధిక ప్రీమియంతో వాటాలను కొనుగోలు చేశారని CBI ఛార్జిషీట్‌లో పేర్కొంది.
ఈ ఛార్జిషీట్‌లో A1గా జగన్, A2గా విజయసాయిరెడ్డి, A3గా నిమ్మగడ్డ ప్రసాద్, A4గా మోపిదేవి వెంకటరమణ, ఏ5గా ధర్మాన ప్రసాదరావు, ఏ6గా కె.వి.బ్రహ్మానందరెడ్డి, A7గా డాక్టర్ మన్మోహన్‌సింగ్, A8గా ఎం.శామ్యూల్, A9గా నిమ్మగడ్డ ప్రకాశ్, ఏ10గా వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, A11గా జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ12 రఘురాం సిమెంట్స్ కార్పొరేషన్స్ లిమిటెడ్,. ఏ13గా కార్మెల్ ఏషియా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ14 సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లు చేర్చింది. కానీ విచారణ మందుకుసాగడంలేదు. నిందితులు ఒకరి తర్వాత ఒకరు హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. ఫలితంగా పదేళ్లకాలంలో వాన్‌పిక్ కేసు విచారణ సీబీఐ కోర్టులో 381సార్లు, ED కోర్టులో 51సార్లు వాయిదా పడింది.
సీబీఐ అభియోగపత్రం ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా 2021 ఆగస్టు 16న ఛార్జిషీట్ వేసి 863 కోట్ల విలువైన ఆస్తుల్ని 2విడతలుగా జప్తు చేసింది. వీటిలో జగన్, ఆయన గ్రూప్ చెందిన కంపెనీలవి 538 కోట్లు నిమ్మగడ్డ, ఆయన గ్రూప్ కంపెనీలవి 325 కోట్లు. జప్తు చెల్లదని అప్పిలేట్ ట్రైబ్యునల్ తీర్పు ఇవ్వగా ED దాన్ని హైకోర్టులో సవాల్ చేసింది. వాన్‌పిక్ ప్రాజెక్ట్‌కు చెందిన 12,500 ఎకరాలకుపైగా భూముల జప్తు చెల్లదని హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఈ తీర్పును ఈడీ సవాల్ చేయగా భూముల విడుదలపై యథాతథ స్థితి పాటించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తనపై కేసు కొట్టేయాలని, నిమ్మగడ్డ వేసిన పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. నిందితులపై సీబీఐ, ఈడీ మోపిన అభియోగాలు రుజువైతే నిందితులకు గరిష్ఠంగా యావజ్జీవ శిక్ష పడే అవకాశాలున్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లకుపైగా శిక్ష పడితే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడుతుంది. తద్వారా శిక్ష పూర్తైన ఆరేళ్ల వరకూ పోటీ చేయడానికి వీలుండదు.
CBI HEARING IN VANPIC CASE :'ముడుపులుగా పెట్టుబడులు పెట్టినందునే... ప్రాజెక్టు కేటాయించారు'
రూ.167 కోట్లకే 12 వేల ఎకరాలు భూములు - జే గ్యాంగ్ భారీ 'భూ'మంతర్!