తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అటు పేలుడు పదార్థాలు, ఇటు గ్యాస్ సిలిండర్- రైలు ప్రయాణికులను చంపేందుకు ఎన్నో కుట్రలు! - Train Track Incidents

Train Track Incidents : రైళ్లను ప్రమాదాలకు గురిచేసే కుట్రపూరిత ప్రయత్నాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగాయి. రైళ్ల పట్టాలను తప్పించి ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగించే ప్రయత్నాలు అధికమయ్యాయి. కొందరు పట్టాలపై ఎల్‌పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ దిమ్మెలు, రాళ్లు, కర్రలు పెడుతూ రైళ్లకు ప్రమాదం కలిగించాలని చూస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్‌లో రైలు పట్టాలపై పేలుడు పదార్థాలను రైల్వేశాఖ గుర్తించింది. అటు, రైలు పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌ను అమర్చిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్​లో జరిగింది.

Train Track Incidents
Train Track Incidents (ANI)

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2024, 7:22 PM IST

Train Track Incidents :ఇటీవల కాలంలో పట్టాలపై భారీ వస్తువులు పెట్టి రైళ్లను ప్రమాదాలకు గురిచేసే కుట్రపూరిత యత్నాలు దేశవ్యాప్తంగా పెరిగాయి. కొందరు దుండగులు పట్టాలపై ఎల్​పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ ఇటుకలను పెట్టి రైలుకు ప్రమాదం తలపెట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్న ఘటనలు తరుచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో అలాంటి ఘటనలే జరిగాయి.

రైలు పట్టాలపై 10 డిటోనేటర్లు
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్‌లో రైలు పట్టాలపై 10 డిటోనేటర్లను రైల్వే పోలీసులు గుర్తించారు. సైనికులతో జమ్ముకశ్మీర్‌ నుంచి కర్ణాటకకు వెళుతున్న రైలుకు పెను ప్రమాదం తప్పింది. బుర్హాన్‌పుర్‌లోని సగ్పట రైల్వే స్టేషన్‌ వద్ద పది పేలుడు పదార్థాలను గుర్తించారు. అందులో ఒకటి పేలడం వల్ల లోకోమోటీవ్‌ పైలట్‌కు అనుమానం వచ్చి రైలును ఆపేసి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు పట్టాలపై పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

పట్టాలపై సిలిండర్‌
అటు రైలు పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌ను అమర్చిన ఘటన ఉత్తర్​ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో వెలుగుచూసింది. లోకోపైలెట్‌ ముందుగా ఆ సిలిండర్‌ను గుర్తించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ప్రేమ్‌పుర్‌ రైల్వేస్టేషన్ సమీపంలో ఒక ఎక్స్‌ప్రెస్‌ రైలుకు దారి ఇచ్చే క్రమంలో ప్రయాగ్‌ రాజ్‌కు వెళ్తున్న గూడ్స్‌ రైలును నిలపాల్సి వచ్చింది. ఆ సమయంలో పట్టాలపై ఉన్న సిలిండర్‌ను గమనించిన లోకో పైలట్‌ వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

రైల్వే ట్రాక్​పై ఇనుప చువ్వలు
అటు పంజాబ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. బఠిండాలో కొందరు దుండగులు బఠిండా- దిల్లీ రైల్వే ట్రాక్‌పై ఇనుప చువ్వలను పెట్టారు. దిల్లీ నుంచి వస్తున్న ఓ గూడ్స్‌ రైలు లోకో పైలట్‌ ట్రాక్‌పై ఉన్న ఇనుపు చువ్వలను గుర్తించాడు. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్‌ ట్రైన్‌ను ఆపేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు స్థానికుల సాయంతో పట్టాలపై నుంచి ఇనుప చువ్వలను తొలగించారు. ఈ ఘటన కారణంగా ఆ గూడ్స్‌ రైలు దాదాపు 40 నిమిషాల పాటు నిలిచిపోయింది.

20కుపైగా ఘటనలు
రైళ్లను పట్టాలు తప్పించి, ప్రమాదాలకు గురిచేసేలా కుట్రపూరిత ప్రయత్నాలు ఇటీవల కాలంలో పెరిగాయని కేంద్రం పేర్కొంది. ఆగస్టు నుంచి 20కు పైగా ఘటనలు వెలుగు చూసినట్లు రైల్వే శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది జూన్ నుంచి 24 ఘటనలు జరిగాయని భారత రైల్వే నివేదిక వెల్లడించింది. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌, తర్వాత పంజాబ్‌, ఝార్ఖండ్, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణలో కుట్రపూరిత యత్నాలు బయటపడినట్లు నివేదించింది.

ABOUT THE AUTHOR

...view details