Railway Food Price In Train : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. జనరల్ కోచ్‌లో ప్రయాణించేవారికి రైల్వేశాఖ కేవలం రూ.20కే ఆహారాన్ని అందిస్తోంది. అలాగే కేవలం రూ.3కే తాగునీటిని ఇస్తోంది. ఎకానమీ ఫుడ్ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న 100 రైల్వే స్టేషన్లలో 150 ఎకానమీ ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. రూ.20కి అందించే ఎకానమీ మీల్స్‌లో 7 పూరీలు (175 గ్రాములు), ఆలు కూర (150 గ్రాములు), పచ్చడిని రూ.20కి అందిస్తారు. రూ.50కి అందించే మీల్లో అన్నం, కిచిడీ, ఛోలే-కుల్చే, ఛోలే-భటూరే, పావ్ భాజీ, మసాలా దోశల్లో ఒక దానిని ఎంచుకోవచ్చు. దీని ధరను రూ.50గా నిర్ణయించారు.
ప్రయాణికులకు మంచి ఆహారాన్ని అందించేందుకు
కాగా, రైల్వే ప్రయాణికులకు తక్కువ ధరలకు పౌష్టికాహారం, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర రైల్వేలోని లఖ్‌నవూ డివిజన్ సీనియర్ డీసీఎం రేఖా శర్మ తెలిపారు. సాధారణ కోచ్‌ల్లో ప్రయాణించే ప్రయాణికులకు తక్కువ ధరలకు ఆహారం, స్నాక్స్, కాంబో మీల్స్, ప్యాకేజ్డ్ వాటర్‌ను అందించడానికి ప్లాట్ ఫారమ్‌లోని జనరల్ క్లాస్ కోచ్‌ల వెలుపల ఎకానమీ ఫుడ్ కౌంటర్లు ప్రారంభించినట్లు వెల్లడించారు. మరోవైపు, రైల్వే ప్రయాణికులకు పరిశుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నామని ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ శోభన్ చౌధరీ తెలిపారు. ఎకానమీ ఫుడ్ నాణ్యత, పరిశుభ్రతను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.