Indian Navy foils Somali pirates: భారత నౌకాదళం మరోసారి సముద్రపు దొంగల దూకుడుకు కళ్లెం వేసింది. తమ ప్రాంతం ద్వారా ప్రయాణించే నౌకలను దోచుకునేందుకు వారు చేసిన యత్నాలను అడ్డుకుంది. ఈ క్రమంలో భారత బలగాల వైపు సముద్రపు దొంగలు కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు భారత్ నేవీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
గత ఏడాది డిసెంబర్ 14న రుయెన్ నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. అయితే దానితోనే ఇతర దేశాల నౌకలను దోచుకునేందుకు ఉపయోగిస్తున్నారని భారత నేవీ గుర్తించింది. ఈ క్రమంలోనే వారున్న ఆ షిప్‌ను అడ్డగించింది. ఆత్మరక్షణ, దోపిడీకి వ్యతిరేకంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారిపై చర్యలు తీసుకున్నామని భారత నేవీ తెలిపింది. ఈ క్రమంలో కొందరు పైరెట్లు రుయెన్ నౌక డెక్‌పైకి వచ్చి కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే పైరెట్లుకు హెచ్చరికలు జారీ చేసినట్లు భారత్ నౌకదళం పేర్కొంది. వెంటనే లొంగిపోవాలని, ఎవరైనా పౌరులు బందీలుగా ఉంటే విడిచిపెట్టాలని హెచ్చరించిట్లు తెలిపింది. తాము సముద్ర భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
ఇటీవలే హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగలు రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ జెండాతో ఉన్న ఓ కార్గో నౌకను హైజాక్ చేశారు. ఈ నౌక మంగళవారం హిందూ మహా సముద్రంలో ప్రయాణిస్తుండగా సముద్రపు దొంగలు అందులోకి చొరబడ్డారు. ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి నౌకను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ నౌక నుంచి వచ్చిన అత్యవసర సందేశంపై భారత్ నౌకాదళం స్పందించింది. ఈ నేపథ్యంలోనే తాజా ఘటన వెలుగులోకి వచ్చింది.