తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రోబో ఆర్మీ' అన్​ డ్యూటీ- 100 'రోబోటిక్ మ్యూల్స్'తో భారత సైన్యానికి సరికొత్త శక్తి - INDIAN ARMY ROBOTIC DOGS

ఆర్మీ పరేడ్​లో రోబోటిక్ డాగ్స్- మార్చ్​పాస్ట్ చేస్తూ స్పెషల్ అట్రాక్షన్

Indian Army Robotic Dogs
Indian Army Robotic Dogs (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2025, 3:22 PM IST

Indian Army Robotic Mules: 77వ సైనిక దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలో నిర్వహించిన ఆర్మీ పరేడ్​లో రోబోటిక్ డాగ్స్ చేసిన మార్చ్​పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్​ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

పుణెలోని బాంబే ఇంజినీరింగ్ గ్రూప్ (BEG)నకు చెందిన పరేడ్ మైదానంలో ఈ ప్రదర్శన జరిగింది. భారత సైన్యానికి చెందిన ప్రత్యేక టీమ్ మార్చ్‌పాస్ట్ నిర్వహించింది. ఈ బృందంలోని సైనికులు, నాలుగు పాదాలతో కూడిన రోబోలను(Q-UGVs) రిమోట్‌తో ఆపరేట్ చేస్తూ కనిపించారు. ఈ రోబోలు క్రమశిక్షణగా ముందుకు సాగుతుండటంగా, వాటి వెనుకే సైనికులు నడిచారు. రోబోల నడక శైలి ఈ పరేడ్‌ను వీక్షించిన వారిని అమితంగా ఆకట్టుకుంటుంది.

సైన్యం అమ్ములపొదిలో 100 రోబోలు
నాలుగు పాదాలతో కూడిన ఎనిమిది రోబోలను భారత సైన్యం అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసింది. రక్షణ రంగ పరిశీలకులు వీటిని సాంకేతికతను సంతరించుకున్న కుక్కలు, రోబోలతో అభివర్ణిస్తున్నారు. ఈ రోబోలను దిల్లీకి చెందిన ఏరోఆర్క్ ప్రైవేటు లిమిటెడ్ (AeroArc Pvt Ltd) కంపెనీ తయారు చేసింది. అందువల్ల వీటికి 'ఆర్క్‌వీ మ్యూల్' (ARCV MULE) అని పేరు పెట్టారు. ఇప్పటివరకు ఏరోఆర్క్ కంపెనీ నుంచి భారత సైన్యం దాదాపు 100 రోబోలను కొనుగోలు చేసింది. ఈ రోబోలకు పెట్టిన పేరులోని MULE అనే పదానికి సవివర అర్థం 'మల్టీ యుటిలిటీ లెగ్​డ్ ఎక్విప్‌మెంట్'. వీటిని రిమోట్‌‌తో ఆపరేట్ చేయొచ్చు. స్వయం ప్రతిపత్తితోనూ ఇవి పనిచేయగలవు. పెరీమీటర్లు, సైనిక పహారా, రసాయన సంబంధిత ప్రమాదాలు, బయోలాజికల్ దాడులు, న్యూక్లియర్ పదార్థాల పేలుళ్లు సంభవించినప్పుడు ఆర్క్‌వీ మ్యూల్ రోబోలను మోహరిస్తారు. బాంబులను నిర్వీర్యం చేసేందుకు సైతం వీటిని వినియోగిస్తారు.

కీలక ఫీచర్లు

  • ఆర్క్‌వీ మ్యూల్ రోబోలో ప్రధానంగా ఐదు భాగాలు ఉన్నాయి.
  • ఇందులోని కంప్యూట్ బాక్స్‌ అనే భాగం రోబోకు మెదడులా సహాయం చేస్తుంది.
  • ఈ రోబోలో ఒక బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే రోబో 20 గంటల పాటు పనిచేస్తుంది.
  • రోబో తల, వెనుక భాగంలో సెన్సార్స్ ఉంటాయి. వీటి సాయంతో పరిసరాల్లో ఏమేం ఉన్నాయనేది రోబో చూస్తుంది.
  • కాళ్ల సాయంతో రోబో నడకను సాగిస్తుంది. సెకనుకు 3 మీటర్ల వేగంతో ఇవి నడవగలవు.
  • ఈ రోబో బరువు 51 కేజీలు.
  • చిన్నపాటి తుపాకులు, కెమెరాలు, డ్రోన్లను ఈ రోబోలను మోసుకెళ్లగలవు. గరిష్ఠంగా 12 కేజీల బరువును ఇవి మోయగలవు.
  • ఈ రోబో మెట్లు ఎక్కగలవు. కొండప్రాంతాల్లో, బురదమయంగా ఉండే ప్రాంతాల్లో నడవగలవు.
  • కనిష్ఠంగా మైనస్ 40 డిగ్రీల శీతల ఉష్ణోగ్రతలోనూ ఈ రోబోలు పనిచేయగలవు. గరిష్ఠంగా 55 డిగ్రీల మండుటెండల్లోనూ ఇవి యాక్టివిటీని చేయగలవు.
  • వీటికి ఐపీ-67 రేటింగ్ లభించింది.
  • నీటిలో మునిగిపోయినా కాసేపటి వరకు ఇవి యాక్టివ్‌గానే ఉంటాయి. దుమ్మూధూళి నుంచి రక్షణ ఉండేలా ఈ రోబోల నిర్మాణ స్వరూపం ఉంటుంది.
  • ఈ రోబోలలో ఎన్‌విడియా జేవియర్ ప్రాసెసర్ ఉంటుంది.
  • ఈ రోబోను 15 నిమిషాల్లోనే వివిధ భాగాలుగా విడగొట్టి.. తిరిగి వాటిని జోడించవచ్చు.

పుణెలో ఇదే మొదటిసారి
1949 జనవరి 15న ఫీల్డ్ మార్షల్ కే ఎం కరియప్పను భారత సైన్యానికి తొలి కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమించారు. బ్రిటీషర్ల చివరి కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియా ఎఫ్ఆర్ఆర్ బుచర్ నుంచి కరియప్ప బాధ్యతలను స్వీకరించారు. ఆ చారిత్రక రోజును గుర్తు చేసుకుంటూ ఏటా జనవరి 15న ఆర్మీ డే పరేడ్‌ను నిర్వహిస్తున్నారు. చాలా ఏళ్ల పాటు దిల్లీలోనే ఈ పరేడ్‌ను నిర్వహించారు. పుణె దీన్ని నిర్వహించడం ఇదే తొలిసారి. 2023లో బెంగళూరులో, 2024లో లఖ్​నవూలో ఈ పరేడ్ జరిగింది.

ABOUT THE AUTHOR

...view details