INDIA Alliance 2024 Lok Sabha Election :కేంద్ర ఎన్నికల సంఘం 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం వల్ల విపక్ష ఇండియా కూటమి సమరానికి సిద్ధమైంది. దేశంలో అధికార మార్పే ప్రధాన ఎన్నికల నినాదంగా ఈ నెల 17న ముంబయిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఐక్యంగా పనిచేయాలని సంకల్పించింది.
విపక్ష కూటమి బలాన్ని చాటేందుకు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభనే వేదికగా చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇక కూటమి పార్టీలు కూడా కాంగ్రెస్ అభిప్రాయానికి జై కొట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 17న భారత్ జోడో న్యాయ్ యాత్ర ముంబయిలో ముగుస్తుందని ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, అదే రోజు ముగింపు సభ ఉంటుందన్నారు. ఈ సభకు ప్రాంతీయ పార్టీల దిగ్గజ నేతలను ఆహ్వానించింది. 6,700 కిలోమీటర్లపాటు సాగిన రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ముంబయిలో ముగియనున్న వేళ దానినే ఎన్నికల శంఖారావ సభకు వినియోగించుకోవాలని విపక్ష ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు.
'హాత్ బద్లేగా హాలత్'
ఆదివారం ముంబయిలో భారీ ఎన్నికల ప్రదర్శన నిర్వహించి తమ బలాన్ని చాటిచెప్పాలని ప్రతిపక్ష ఇండియా భావిస్తోంది. 'హాత్ బద్లేగా హాలత్' నినాదంతో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. హస్తం గుర్తు ఈ దేశంలో మార్పు తీసుకొస్తుందన్న నినాదంతో జన క్షేత్రంలోకి వెళ్లనుంది. ఇండియా కూటమిలో కీలక నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, డీఎంకే నేత స్టాలిన్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సౌరభ్ భరద్వాజ్, దీపాంకర్, సీపీఐ నేత భట్టాచార్య, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఫరూక్ అబ్దుల్లా వంటి ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ ముంబయిలో నిర్వహిస్తున్న భారీ మీటింగ్‌కు హాజరుకానున్నారు. ఈ న్యాయ్ యాత్ర ముగింపు సభలో ప్రతిపక్షం తన బలాన్ని దేశానికి చాటి చెప్తుందని ఏఐసీసీ మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్ సెక్రటరీ ఆశిష్ దువా వెల్లడించారు.