Lord Balabhadra Idol Fall Down : ఒడిశాలోని పూరీలో రథయాత్ర అనంతరం జరిగిన ఆచారంలో అపశ్రుతి జరిగింది. బలభద్రుని రథం నుంచి కిందకు దించుతున్న సమయంలో విగ్రహం సేవాయత్‌లపై ఒరిగిపోయింది. ఈ ఘటనలో 9 మంది సేవాయత్‌లు గాయపడ్డారు. వెంటనే పూరీ ఆస్పత్రికి తరలించి క్షతగాత్రులకు చికిత్స అందించారు. మిగలిన సేవాయత్‌లు విగ్రహాన్ని గుండిచా మందిరంలోకి తీసుకెళ్లారు. తదుపరి పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు.
ఏం జరిగిందంటే?
గుండిచా మందిరం వెలుపల మంగళవారం రాత్రి 8:30 గంటల సమయంలో చతుర్థామూర్తుల పొహండి ప్రారంభమైంది. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. దీనిపై సేవాయత్‌లు, భక్తుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇది ఆకస్మికంగా జరిగిపోయిందని సేవాయత్‌ల సంఘం ప్రతినిధి రామకృష్ణ దాస్ మహాపాత్ర్ చెప్పారు.
పూరీలో అపశ్రుతి- సేవాయత్‌లపై పడ్డ బలభద్రుని విగ్రహం! (ETV Bharat) సీఎం ఆందోళన
పొహండి సమయంలో ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన సేవకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వెంటనే పూరీకి వెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని న్యాయశాఖ మంత్రి పృథివీరాజ్ హరిచందన్‌ను ఆయన ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి పూరీ ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. అందరూ కోలుకుంటున్నట్లు తెలిపారు.
ఎన్నో సూచనలు ఇచ్చినా!
అయితే ఈసారి పూరీలో రథయాత్రలో అపశ్రుతులుండవని, అంతా నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ కొన్నిరోజుల క్రితం చెప్పారు. శ్రీక్షేత్ర యంత్రాంగం సేవాయత్‌లకు ఈమేరకు సూచనలు కూడా చేసింది. సకాలంలో పురుషోత్తమ సేవలు పూర్తి చేయాలని, రథాలపై దివ్యవిగ్రహాల ఎదుట సేవాయత్‌లు అడ్డంగా నిల్చొరాదని స్పష్టం చేసింది. సేవలతో ప్రమేయం ఉన్నవారే రథాలపై ఉండారని పాలనాధికారి వీర్‌విక్రం యాదవ్ చెప్పారు. దీన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామని పేర్కొన్నా యాత్రలో ఆ పరిస్థితి కనిపించలేదు. విగ్రహాలకు ఎదురుగా సేవాయత్‌లు నిల్చొని చూసేవారికి అడ్డమయ్యారు. అధికారులంతా చూసినా నిస్సహాయంగా మిగిలారు.
జగన్నాథుని నందిఘోష్ రథంపై 70 మంది, బలభద్రుని వద్ద 60 మంది, దేవీ సుభద్ర సన్నిధిలో 50 మంది మాత్రమే సేవలకు నియమితులయ్యారు. వారి జాబితాను యంత్రాంగం యాత్రకు ముందే ప్రకటించింది. వేడుకల్లో వందల సంఖ్యలో సేవాయత్‌లు, వారి పిల్లలు రథాలపై కనిపించారు. ముగ్గురుమూర్తుల సన్నిధిలో వారంతా అడ్డంగా నిలబడ్డారు. దర్శనానికి తహతహలాడిన లక్షలాదిమంది భక్తులకు స్వామి కనిపించపోవడం వల్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆది, సోమవారాల్లో (రెండ్రోజులు) జరిగిన యాత్రలో ఇవే దృశ్యాలు కనిపించినా, అధికారులు చర్యలు తీసుకోలేదు!
పూరీ శ్రీమందిర్ రత్న భాండాగారం తెరచుకునేది అప్పుడే! - Puri Srimandir Ratna Bhandar
పూరీ జగన్నాథ్ భక్తుడి కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా- గాయపడిన వారంతా సేఫ్!