తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మానవ మూత్రంతో విద్యుత్ ఉత్పత్తి- లీటర్​ యూరిన్​తో ఫోన్ ఛార్జ్- ఎరువుల తయారీ కూడా!

Human Urine Generate Electricity: మానవ మూత్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేశారు ఐఐటీ పాలక్కాడ్ శాస్త్రవేత్తలు. మూత్రంతో ఎరువులను సైతం తయారు చేశారు. మూత్రం నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్​ను ఎల్ఈ​డీ లైట్లకు, మొబైల్ ఛార్జింగ్స్ కోసం ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Human Urine Generate Electricity
Human Urine Generate Electricity

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 6:26 PM IST

Human Urine Generate Electricity: మానవ మూత్రం నుంచి విద్యుత్​ ఉత్పత్తి చేశారు కేరళకు చెందిన పాలక్కాడ్ ఐఐటీ శాస్త్రవేత్తలు. ఆ విద్యుత్​ను ఎల్​ఈడీ లైట్లకు, మొబైల్ ఛార్జింగ్స్​ కోసం ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. విద్యుత్​తో పాటు మూత్రం నుంచి ఎరువును కూడా తయారు చేశారు. తొలుత ఆవు మూత్రంతో విద్యుదుత్పత్తి చేశారు ఐఐటీ పరిశోధకులు. ఆ తర్వాత మానవ మూత్రంపై ప్రయోగాలు చేసి విజయవంతమయ్యారు.

ఐఐటీ పాలక్కాడ్​లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ గంగాధరన్ నేతృత్వంలోని బృందం ఈ కొత్త ఆవిష్కరణ చేసింది. ఈ బృందంలో రీసెర్చ్ స్కాలర్ వీ సంగీత, ప్రాజెక్టు సైంటిస్ట్ డాక్టర్ శ్రీజిత్, సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన రీసెర్చ్ అసోసియేట్ రిను అన్నా కోశి ఉన్నారు. 'స్టెల్ యూరిన్ కాటలైజ్డ్ రిసోర్స్ రికవరీ' పేరుతో ఈ పరిశోధనలు చేశారు. అయితే మానవ మూత్రంపై జరిపిన పరిశోధనలకు ఇంకా పేటెంట్ రైట్స్ రాలేదని, ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నామని ఐఐటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆవు మూత్రంతో విద్యుదుత్పత్తికి సంబంధించిన ప్రయోగ వివరాలు 'సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ' అనే సైన్స్ జర్నల్​లో ప్రచురితమయ్యాయని చెప్పారు.

ఎలా తయారు చేస్తారంటే?
ఎటువంటి మిశ్రమం లేని ఆవు మూత్రాన్ని ఒక ఛాంబర్​లో సేకరిస్తారు. తర్వాత ఎలక్ట్రోకెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్​లోకి మూత్రాన్ని పంపిస్తారు. ఈ రియాక్టర్ గాజుతో తయారు చేసిన చిన్న సెల్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ సెల్స్​లో మెగ్నీషియం ఆనోడ్​లా, గాలి క్యాథోడ్​లా పని చేస్తుంది. ప్రాథమిక పరిశోధనలో 50 సెల్స్ ఉపయోగించారు. ఒక్కో సెల్ 100 మిల్లీ లీటర్ల గోమూత్రంతో పని చేస్తుంది. ఎలక్ట్రోడ్, మూత్రం మధ్య రసాయన చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

విద్యుత్​ను ఉత్పత్తి చేసిన తర్వాత మూత్రాన్ని మరొక ఛాంబర్​లోకి మార్చి అక్కడే ఎరువులను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఒక లీటర్ మూత్రం నుంచి సగటున 1.5 ఓల్టుల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ల ఛార్జింగ్, ఎమర్జెన్సీ విద్యుద్దీపాలను వెలిగించుకునేందుకు ఈ కరెంట్ సరిపోతుందని చెప్పారు.

ఈ ఎరువులు కూడా
మూత్రం నుంచి ఏకకాలంలో విద్యుత్​ను, బయో ఎరువును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 'ఎదిగిన మనిషిలో ప్రతి రోజూ 1.5 లీటర్ల మూత్రం ఉత్పత్తి అవుతుంది. దీని ప్రకారం సంవత్సరానికి 500 లీటర్ల మూత్రం ఉత్పత్తి అవుతుంది. 500 లీటర్ల మానవ మూత్రం నుంచి 2.5 -4.3 కిలోల నైట్రోజన్, కేజీ పాస్ఫరస్, పొటాషియంను తయారు చేయవచ్చు' అని శాస్త్రవేత్తలు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details