How to Prepare Meetha Samosa at Home :మనలో చాలా మంది కార్న్, ఆలూ, ఉల్లి.. సమోసాలను మాత్రమే ఎక్కువగా తిని ఉంటారు. కానీ, ఈసారి సరికొత్తగా మీఠా సమోసాను టేస్ట్ చేయండి. స్వీట్స్ ఇష్టపడేవాళ్లకు తెగ నచ్చుతుంది. మేము చెప్పే స్టెప్స్ ఫాలో అవుతూ.. మీఠా సమోసా(Samosa)ను ఇంట్లో ఈజీగా తయారు చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా లాగిస్తారు. మరి మీఠా సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం.
పిండి కోసం కావాల్సినవి :
- మైదా పిండి - 2 కప్పులు
- బొంబాయి రవ్వ - 1 చెంచా
- నెయ్యి - పావు కప్పు
- నీళ్లు
- చిటికెడు ఉప్పు
స్టఫింగ్ కోసం కావాల్సిన పదార్థాలు :
- కోవా - 1కప్పు
- చక్కెర/బెల్లం పొడి - 1/2 కప్పు
- జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు - అన్నీ కలిపి ముప్పావు కప్పు
- కొబ్బరిపొడి - 1 టేబుల్‌స్పూన్
- యాలకుల పొడి - 1 స్పూన్
- నూనె - వేయించేందుకు సరిపడా
పాకం కోసం :
- పావుకప్పు - వాటర్
- కప్పు - చక్కెర
Best Street Foods in Hyderabad: హమారా హైద్రాబాద్.. ఈ స్ట్రీట్ ఫుడ్స్ ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!
మీఠా సమోసా తయారీ విధానం :
- ముందుగా ఓ గిన్నెలో మైదా, బొంబాయి రవ్వను జల్లెడ పట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత వాటర్ చల్లుకుంటూ ఆ మిశ్రమాన్ని చపాతీపిండిలా కలుపుకోవాలి.
- ఆపై ఓ చెంచా నెయ్యి, చిటికెడు ఉప్పు వేసి మరోసారి దాన్ని కలిపి పక్కన పెట్టేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద ప్యాన్ పెట్టుకొని మిగిలిన నెయ్యి వేసుకోవాలి. అది కరిగాక బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో కోవా, చక్కెర, కొబ్బరిపొడి, యాలకుల పొడి వేసి రెండు నిమిషాలపాటు వేయించుకొని స్టౌ మీద నుంచి ప్యాన్ దింపి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి.
- అనంతరం స్టౌ మీద మరో గిన్నె పెట్టుకొని పాకం కోసం నీళ్లు, చక్కెర పోసుకోవాలి. అప్పుడు చక్కెర కరిగి పాకంలా అవుతున్నప్పుడు గిన్నెను దింపేసుకోవాలి.
- ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నానిన పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా వత్తి మధ్యకు కట్ చేయాలి.
- అలా కట్ చేసిన చపాతీ ముక్క మధ్యలో ఒకటిన్నర చెంచా కోవా మిశ్రమాన్ని ఉంచి.. సమోసా ఆకృతి వచ్చేలా అంచుల్ని మూసేసుకోవాలి.
- ఈ విధంగా పిండి మొత్తం ఎన్ని సమోసాలు అవుతాయో అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీదు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని.. కాస్త వేడి అయ్యాక ప్రిపేర్ చేసుకున్న సమోసాల్ని రెండు చొప్పున అందులో వేసి ఎర్రగా వేయించుకోవాలి.
- అయితే ఇక్కడ వేయించేందుకు నూనెకు బదులుగా నెయ్యిని కూడా యూజ్ చేయవచ్చు.
- వేయించుకున్న వాటిని రెండు నిమిషాలయ్యాక చక్కెరపాకంలో ముంచి తీయాలి.
- అంతే.. ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే మీఠా సమోసాలు రెడీ!
నోరూరించే నూడుల్స్- ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినడం పక్కా!