తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిటపట చినుకుల వేళ స్పైసీ స్పైసీ "పుదీనా చారు"- ఇలా ప్రిపేర్​ చేస్తే తినడమే కాదు తాగొచ్చు కూడా! - PUDINA RASAM Preparation - PUDINA RASAM PREPARATION

Mint Rasam Recipe : వానలతో తెలుగు రాష్ట్రాలు తడిసిపోతున్నాయి. కాబట్టి ఈ కూల్‌ వెదర్‌లో వేడివేడి అన్నంలోకి చారు చేసుకుని తింటే సూపర్‌గా ఉంటుంది. అయితే, ఎప్పుడూ టమాటాలు, చింతపండుతో చారు చేయకుండా.. ఈ సారి కొత్తగా పుదీనా చారు ట్రై చేయండి. కాస్త ఘాటుగా, పుల్లపుల్లగా ఉండే ఈ రసం రుచిగా ఉండటంతో పాటు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

Mint Rasam
How TO Make Pudina Rasam (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 2:52 PM IST

How to Make Pudina Rasam :బయట వర్షం.. ఇంట్లో కూర్చుంటేనేమో చలి! ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంది. అయితే ఈ కూల్‌ వెదర్‌లో చాలా మంది వేడి వేడి అన్నంలో చారు పోసుకుని తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక చారు అంటే.. టమాటా, మిరియాలతో చేసినవే గుర్తుకువస్తాయి. అయితే ఈ సారి అవి కాకుండా.. పుదీనా చారు ట్రై చేయండి. దీని టేస్ట్​ అమృతంలా ఉంటుంది. అంతేనా ఈ కూల్​ వెదర్​లో తింటుంటే గొంతులోకి జప్పున జారుతుంది. మరి దీనిని ఎలా ప్రిపేర్​ చేయాలో ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్ధాలు :

చారు పౌడర్‌ కోసం :

  • ఎండు మిర్చి-3
  • జీలకర్ర- టీస్పూన్‌
  • ధనియాలు- టేబుల్‌స్పూన్‌
  • కందిపప్పు- టీస్పూన్‌
  • మిరియాలు-టీస్పూన్‌
  • నూనె-అర టీస్పూన్‌

రసం కోసం :

  • చిక్కటి చింత పండు రసం - 100 ml
  • నీళ్లు - 400ml
  • పసుపు- పావు టీస్పూన్‌
  • ఉప్పు- రుచికి సరిపడా
  • మెత్తగా ఉడికించుకున్న కందిపప్పు- అరకప్పు
  • పుదీనా ఆకులు తరుగు- కప్పు

తాలింపు కోసం :

  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • ఆవాలు - అర టీ స్పూన్​
  • ఎండుమిర్చి-2
  • ఆయిల్‌- టేబుల్‌స్పూన్‌
  • ఇంగువ - చిటికెడు

పుదీనా రసం తయారీ విధానం :

  • ముందుగా స్టౌ ఆన్‌ చేసి పాన్‌లో ధనియాలు, మిరియాలు, కందిపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేయండి. తర్వాత కొద్దిగా ఆయిల్‌ వేసి వాటిని ఎర్రగా వేపుకోండి.
  • ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి గిన్నె పెట్టుకుని అందులో చింత పండు రసం పోసుకోండి. అలాగే అర టీస్పూన్‌ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, వాటర్‌, ముందే ప్రిపేర్​ చేసుకున్న చారు పొడి వేసి కలుపుకుని మంట సిమ్​లో పెట్టి ఓ పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత రసంలో మెత్తగా ఉడికించుకున్న కందిపప్పు వేసుకుని కలిపి మూత పెట్టాలి.
  • ఇప్పుడు బాగా మరుగుతున్న చారులో పుదీనా ఆకులు వేసి మూత పెట్టి.. లో ఫ్లేమ్‌లో ఓ మూడు నిమిషాలు మరిగించి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • తర్వాత తాలింపు కోసం స్టవ్​ మీద పాన్​ పెట్టి ఆయిల్‌ పోసుకోవాలి. అది హీటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించుకుని.. చారులో కలుపుకుంటే సరిపోతుంది. అంతే ఎంతో టేస్టీగా, ఘాటుగా ఉండే పుదీనా చారు రెడీ.
  • ఈ చారుని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. నచ్చితే, మీరూ ఓ సారి పుదీనా చారు ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

అద్దిరిపోయే టమాటా రసం నిమిషాల్లో సిద్ధం - అన్నంలోకే కాదు సూప్​లా తాగేయొచ్చు!

సూపర్ రెసిపీ : మసాలా ఎగ్ బుర్జీ - నషాళానికి తాకాల్సిందే!

బ్రెడ్​తో స్పైసీ స్పైసీ వంటలు- తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసుకోవడం పక్కా!

ABOUT THE AUTHOR

...view details