Best Tips To Choose Good Mattress :ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరి ఇళ్లలో డబుల్ కాట్ మంచాలు ఉన్నాయి. ఇక వాటిపై కొందరు మామూలు పరుపులు యూజ్ చేస్తుంటే, ఇంకొందరు బ్రాండెడ్‌వి వాడుతుంటారు. నిజానికి నాణ్యమైన పరుపు ఉంటే మంచి పోశ్చర్‌లో హ్యాపీగా ఎక్కువసేపు నిద్రపోతామని అందరికీ తెలిసిన విషయమే. కానీ, చాలా మంది సరైన పరుపును(Mattress)ఎంచుకోవడంలో విఫలమవుతుంటారు. దీంతో నాణ్యమైన పరుపు తీసుకోలేదని, డబ్బులు వృథా అయ్యాయని బాధపడుతుంటారు. అలాకాకుండా మీరు పరుపు కొనేటప్పుడు మేము చెప్పబోయే టిప్స్ పాటించారంటే మంచి పరుపు మీ సొంతమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పరుపు రకం :మీరు సరైన పరుపును ఎంచుకోవడంలో మ్యాట్రెస్ టైప్ కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. మార్కెట్లో అందుబాటులో ఉండే వివిధ రకాల పరుపులు వివిధ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఇన్నర్స్ప్రింగ్స్, మెమరీ ఫోమ్, లాటెక్స్, హైబ్రిడ్.. ఇలా అనేక రకాలుగా ఉంటాయి పరుపులు. వాటిల్లో మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి నిద్రను, చర్మానికి మృదువుగా ఉండే అధిక నాణ్యత గల పరుపును కొనుగోలు చేయడం ఎల్లప్పుడూ మంచిది అంటున్నారు నిపుణులు.
సైజ్ :మంచి నాణ్యత గల పరుపును కొనాలనుకున్నప్పుడు మీరు చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం.. దాని సైజ్. ఎందుకంటే మీరు కొన్న పరుపు డబుల్ కాట్ మంచానికి సరిగ్గా సెట్ కాకపోతే.. సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల అది త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే కంఫర్ట్‌గా నిద్రపోవడానికి ఇబ్బందికరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి, మీ మంచానికి సైజ్‌ను బట్టి మ్యాట్రెస్ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి అంటున్నారు.
మందం : మందంగా ఉన్న పరుపు శరీరానికి మంచి సపోర్ట్ ఇవ్వడంతో పాటు వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందడంలో ఎంతో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి మీరు తీసుకునే మ్యాట్రెస్ కావాల్సినంత మందంగా ఉంటే అది మీకు మరింత సౌకర్యవంతంగా మారుతుందని చెబుతున్నారు. అలాకాకుండా, మీరు తీసుకున్న పరుపు ఎక్కువ మందంగా ఉన్నా లేదా మరి సన్నగా ఉన్నా దానిపై పడుకోవడం నిద్రకు భంగం కలిగించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.