మసీదులో 'జై శ్రీరామ్' అంటే నేరమెలా అవుతుంది? - JAI SHRI RAM SLOGAN IN A MOSQUE
'జై శ్రీరామ్' అంటే నేరమెలా అవుతుంది - పిటిషనర్‌ను ప్రశ్నించిన సుప్రీం కోర్ట్
Published : 5 hours ago
Jai Shri Ram Slogan In A Mosque : 'జై శ్రీరామ్' అని నినాదమివ్వడం నేరం ఎలా అవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మసీదులోకి ప్రవేశించి 'జై శ్రీరామ్' అని అరిచిన ఇద్దరు వ్యక్తులపై విచారణను రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ నిర్వహించింది. "ఒక మతానికి చెందిన పదబంధాన్ని లేదా పేరును పఠించినంత మాత్రాన అది నేరం ఎలా అవుతుంది?" అని పిటిషనర్ హైదరాలీని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఇంకొకరి మతపరమైన ప్రాంతంలో మతపరమైన నినాదం ఇవ్వడం విద్వేషాలను రెచ్చగొట్టడం కిందకే వస్తుందని, ఇది భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 153ఎ ప్రకారం నేరమని న్యాయస్థానానికి పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దేవదత్త కామత్ తెలిపారు. మరి నిందితులను గుర్తించారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి కర్ణాటక పోలీసులే సమాధానమివ్వాలని కామత్ తెలిపారు. దీంతో పిటిషన్ ప్రతిని కర్ణాటక ప్రభుత్వానికి పంపాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ధర్మాసనం జనవరికి వాయిదా వేసింది.