తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిమాచల్​కు ట్రబుల్ షూటర్లు- రెబల్​ ఎమ్మెల్యేలలో చర్చలు! సుఖు సర్కార్ గట్టెక్కేనా? - himachal pradesh rajya sabha

Himachal Pradesh Political Crisis Congress : హిమాచల్​ప్రదేశ్​లో ఏర్పడిన రాజకీయ అస్థిరతను కాంగ్రెస్ అధిష్ఠానం చక్కదిద్దగలదా? సీఎం సుఖ్వీందర్ సుఖుపై రెబల్​ ఎమ్మెల్యేల అసమ్మతిని తగ్గించగలదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే హిమాచల్​ రాజకీయ సంక్షోభాన్ని అరికట్టేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హరియాణా మాజీ సీఎం దీపిందర్ సింగ్ హుడాను రంగంలోకి దించింది కాంగ్రెస్ అధిష్ఠానం.

Himachal Pradesh Political Crisis Congress
Himachal Pradesh Political Crisis Congress

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 6:24 PM IST

Himachal Pradesh Political Crisis Congress : హిమాచల్​ప్రదేశ్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ట్రబుల్ షూటర్లను రంగంలోకి దించింది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు పనితీరుతో తాము విసిగిపోయామని, కాంగ్రెస్​కు వ్యతిరేకం కాదని హస్తం పార్టీ ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో వారిని ఒప్పించేందుకు హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్​ హుడా, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ను రంగంలోకి దించింది అధిష్ఠానం. మరోవైపు, తిరుగుబాటు ఎమ్మెల్యేలను నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని హిమాచల్​ప్రదేశ్​ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సెక్రటరీ తజిందర్ పాల్ సింగ్ బిట్టు ఈటీవీ భారత్‌తో తెలిపారు.

రంగంలోకి ట్రబుల్ షూటర్లు
హిమాచల్ సంక్షోభాన్ని సరిదిద్దేందుకు అధిష్ఠానం నియమించిన ట్రబుల్ షూటర్లు హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్​ హుడా, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం శిమ్లా చేరుకున్నారు. వారు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చర్చిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. హిమాచల్​ప్రదేశ్​లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని సాయంత్రానికి రెబల్ ఎమ్మెల్యేలతో అదిష్ఠానం నియమించిన పరిశీలకులతో మాట్లాడుతారని వెల్లడించాయి.

'రెబల్ ఎమ్మెల్యేల సమస్యలను పరిష్కరించి పార్టీ అధిష్ఠానం హిమాచల్​లో రాజకీయ సంక్షోభాన్ని అదుపులోకి తీసుకురాగలదని భావిస్తున్నాను. అయితే, తిరుగుబాటు ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రితో ఏవైనా సమస్యలు ఉంటే వారు అధిష్ఠానానికి తెలియజేయాలి' అని ఏఐసీసీ కార్యదర్శి చేతన్ చౌహాన్ ఈటీవీ భారత్​కు తెలిపారు. 'సుఖు గత ఏడాదిన్నరగా ప్రభుత్వాన్ని బాగానే నడుపుతున్నారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతుగా ప్రవర్తించారు. ఇప్పుడు సుఖును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు' అని కాంగ్రెస్ నాయకుడు ఒకరు ఈటీవీ భారత్​లో చెప్పారు.

'పరిశీలకుల నివేదిక వచ్చాకే నిర్ణయం'
మరోవైపు, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య రాజీనామాకు ముందు తాను సుఖుతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేనని హైకమాండ్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. 'రెబల్ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మధ్య ఏకాభిప్రాయం కుదిర్చి ప్రభుత్వాన్ని కాపాడడమే పార్టీ తొలి లక్ష్యం. మరోసారి బీజేపీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రిని తొలగించాలంటే ఆయన అంగీకారంతోనే జరగాలి. ఇప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యేల డిమాండ్లకు మేము అంగీకరిస్తే, తర్వాత వారు మరి కొన్ని డిమాండ్లు చేస్తారు. పరిశీలకుల నివేదిక వచ్చిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటాం' అని ఏఐసీసీ నాయకుడు ఒకరు చెప్పారు.

రాహుల్​తో మాట్లాడిన ఖర్గే
హిమాచల్​లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో మాట్లాడినట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్తున్నానని చెప్పారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​. 'కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి విధేయులుగా ఉంటారని, అదిష్ఠానం ఆదేశాలకు కట్టుబడి ఉంటారని విశ్వసిస్తున్నాను. బీజేపీ అధికారం కోసం ఉద్దేశపూర్వకంగా ప్రజాస్వామ్యాన్ని, ప్రజా ఆదేశాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది.' అని ఎక్స్​(ట్విట్టర్​)లో పోస్ట్ చేశారు.

'బీజేపీ కుట్ర విఫలం'
హిమాచల్​ప్రదేశ్​లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆరోపించారు. ఈ కుట్ర విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్​కు అనర్హత తీర్మానం ఇచ్చామని చెప్పారు. ఈ అనర్హత తీర్మానం స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు ఐదేళ్లు పూర్తి చేసుకుంటుందని స్పష్టం చేశారు.

"నేను ఎన్నో పోరాటాలు చేసి రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజల మద్దతుతో రాజకీయాలు చేస్తున్నాను. మేం తప్పుకుండా విజయం సాధిస్తాం. వారు (‌బీజేపీ) రాజకీయ సంక్షోభం సృష్టించేందుకు చేసే కుట్రలన్నింటినీ ఛేదిస్తాం. కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం. కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుంది. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. " అని సుఖ్వీందర్ సింగ్ సుఖు స్పష్టం చేశారు.

స్పీకర్ ఎదుట రెబల్ ఎమ్మెల్యేలు
రాజ్యసభ ఎన్నికల్లో విప్‌ను ధిక్కరించినందుకుగానూ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఆరుగురు స్పీకర్ ముందు హాజరయ్యారు. తమకు నోటీసులు మాత్రమే ఇచ్చారని, మంగళవారం సాయంత్రం దాఖలు చేసిన పిటిషన్ కాపీని తమకు ఇవ్వలేదని చెప్పారు. ఈ సమయంలో రెబల్ ఎమ్మెల్యేల వెంట వారి తరఫున వాదిస్తున్న లాయర్ సత్యపాల్ జైన్ సైతం ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పదేపదే చెప్పిందని ఆయన అన్నారు.

నేరుగా ఇంటికే అయోధ్య 'హనుమాన్​' ప్రసాదం- మనీ ఆర్డర్ చేస్తే చాలు!

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్​- 10 సీట్లలో బీజేపీ విజయభేరి, 3స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు

ABOUT THE AUTHOR

...view details