Fake Ration Cards In India :దేశంలో 5.80 కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 20.40 కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తి అయినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా దేశంలో మొత్తంగా 80.60 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని తెలిపింది. ఆధార్ ధ్రువీకరణ, ఈ-కేవైసీ వెరిఫికేషన్‌ల ద్వారా దేశవ్యాప్తంగా 5.80 కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు వివరించింది.
5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల ఎత్తివేత - FAKE RATION CARDS IN INDIA
20.4 కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తి - 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల ఏరివేత: కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ
Published : Nov 20, 2024, 7:29 PM IST
|Updated : Nov 20, 2024, 7:53 PM IST
దేశవ్యాప్తంగా 5.33 లక్షల చౌక ధరల దుకాణాలకు ఈపోస్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. వీటి సాయంతో 99.8 శాతం కార్డులను ఆధార్‌తో ఆనుసంధానం చేయగా, 98.7 శాతం లబ్ధిదారులకు బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తైనట్లు వెల్లడించింది. ఈ-కేవైసీ ప్రక్రియతో ఇప్పటి వరకు 64 శాతం లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయ్యిందని కేంద్రం తెలిపింది. డిజిటైజేషన్ కారణంగా పీడీఏస్లో భారీ స్థాయిలో మార్పులు వచ్చినట్లు, తద్వారా ఆహార భద్రతలో ప్రపంచానికే కొత్త బెంచ్ మార్కును నెలకొల్పినట్లు అయ్యిందని కేంద్రం తెలిపింది.
ఇదిలా ఉండగా, ఆహార పదార్థాల సరఫరా విషయంలోనూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పకడ్బందీగా వ్యవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో సరకు రవాణాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ఓ వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌నూ రైల్వేలతో అనుసంధానం చేశామంటూ తెలిపింది. ఇక వన్ నేషన్ - వన్ రేషన్ కార్డు పథకం వల్ల లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా సరకులు తీసుకునే అవకాశం ఏర్పడిందని పేర్కొంది.