Girl Commits Suicide In Kota : పోటీ పరీక్షలకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడంలేదు. జేఈఈ మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న మరో విద్యార్థిని తాజాగా బలవన్మరణానికి పాల్పడింది. తాను చదవలేకపోతున్నానని, క్షమించాలంటూ తల్లిదండ్రులకు ఆత్మహత్య లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది.
ఎల్లుండే పరీక్ష- అంతలోనే
18 ఏళ్ల విద్యార్థిని కోటాలో 12వ తరగతి చదువుతోంది. JEE పోటీ పరీక్షల కోసం స్థానిక కోచింగ్ సెంటర్‌లో చేరిన ఆమె, సోమవారం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన బాలిక తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గదిలో విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. అందులో తాను JEE చదవలేకపోతున్నానని రాసింది. తాను ఓడిపోయానని, తన తల్లిదండ్రులను క్షమించమని కోరింది. జనవరి 31న JEE పరీక్ష రాయాల్సి ఉండగా, మానసిక ఒత్తిడి వల్లే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
"అమ్మా, నాన్నా నేను జేఈఈ చదువు చదవలేను. అందుకే సూసైడ్ చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నా. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి."
-సూసైడ్ నోట్