అతడో కరుడుగట్టిన మాజీ గ్యాంగ్‌స్టర్. వయసు 60 ఏళ్లు. ఓ మర్డర్ కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాదే విడుదలయ్యాడు. ఇదంతా బాగానే ఉన్నా ప్రస్తుతం అతడు మళ్లీ వార్తల్లో నిలిచాడు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం అతడికి వయసుతో పాటు చట్టపరంగా ఉన్న కొన్ని పరిమితులు అడ్డంకిగా మారాయి. దీంతో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాడు. దీంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సలహా మేరకు ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్యను సదరు పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దింపబోతున్నాడు.
ఎవరీ అశోక్ మహతో?
Gangster Ashok Mahato Got Married : నవాడా జిల్లాలోని కోనన్‌పుర్ గ్రామానికి చెందిన అశోక్ మహతో ఓ మాజీ గ్యాంగ్‌స్టర్. షేక్‌పురా జేడీయూ ఎమ్మెల్యే రణధీర్ కుమార్ సోనీపై హత్యాయత్నం ఆరోపణలతో పాటు నవాడా జైల్ బ్రేక్ కేసులో నేరస్థుడిగా 17 ఏళ్ల పాటు జైలులో శిక్ష అనుభవించాడు. 2023లో జైలు నుంచి బయటకు వచ్చాడు. మరోవైపు 2005లో జరిగిన ఎంపీ రాజో సింగ్ హత్యతో కూడా అశోక్ మహతో గ్యాంగ్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు.
లాలూకా ప్లాన్!
అయితే గ్యాంగ్‌స్టర్ అశోక్ మహతో పట్నా భక్తియార్‌పుర్‌లోని కరౌటా జగదాంబ ఆలయంలో ఓ మహిళను మంగళవారం రాత్రి తన మద్దతుదారుల సాయంతో వివాహం చేసుకున్నాడు. ముంగేర్ బరియార్పూర్ గ్రామానికి చెందిన ఈమె ఇంతకుముందు దిల్లీలో పని చేసేది. ఇక తన భార్యను ముంగేర్ లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్రీయ జనతాదళ్- ఆర్జేడీ అభ్యర్థిగా పోటీలోకి దింపబోతున్నట్లు సమాచారం. అయితే ఇదంతా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సలహాలు, సూచనల మేరకే జరుగుతున్నట్లు తెలుస్తోంది.