Gaganyaan Astronauts :గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు పి.బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్తోపాటు వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. వీళ్లతో మోదీ ముచ్చటించారు. ఈ వ్యోమగాములను 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే నాలుగు శక్తులుగా అభివర్ణించారు మోదీ. కేరళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో గగన్‌యాన్ ప్రాజెక్టు పురోగతిని పరిశీలించారు మోదీ. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మోదీని సత్కరించారు.
వారి భాగస్వామ్యం లేనిదే!
21వ శతాబ్దంలో భారత్ ప్రపంచస్థాయి దేశంగా అవతరిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో పురోగమిస్తోందని తెలిపారు. చంద్రయాన్, గగన్‌యాన్ వంటి ప్రాజెక్టుల్లో మహిళల పాత్ర ఎనలేనిదని మోదీ కొనియాడారు. వారి భాగస్వామ్యం లేనిదే ఈ ప్రాజెక్టులు సాధ్యమయ్యేవి కాదని అన్నారు. గగన్‌యాన్ మిషన్‌లో చాలా వరకు భారత్లో తయారైన పరికరాలను ఉపయోగించడం గర్వకారణమని చెప్పారు.