తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో పోటాపోటీగా ఉచితాల జల్లు- ప్రజాసమస్యల ఊసే లేదు! ఎన్నికల్లో వీటి ప్రభావమెంత? - DELH ASSEMBLY ELECTION FREEBIES

దిల్లీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్- స్థానిక సమస్యల కన్నా ఉచితాలకు అధిక ప్రాధాన్యం!

DELH ASSEMBLY ELECTION FREEBIES
DELH ASSEMBLY ELECTION FREEBIES (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2025, 5:02 PM IST

  • దిల్లీ ఎన్నికల ప్రచారంలో అసలైన అంశాలకు దక్కని ప్రాధాన్యం
  • ఈసారి 'ఆప్' భారమంతా ఉచిత హామీలపైనే
  • అదే బాటలో కాంగ్రెస్, బీజేపీ
  • ఆర్థికసాయం హామీతో మహిళా ఓటర్లకు ఆకట్టుకునే యత్నం
  • ఉచిత విద్యుత్‌ హామీతో మధ్యతరగతికి వల

దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు సమీపించడం వల్ల రాజకీయ వేడెక్కుతోంది. రాజకీయ పార్టీలు ఉచిత హామీలతో ఊదరగొడుతున్నాయి. హస్తిన ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో అసలు ప్రజా సమస్యలు తెరమరుగు అవుతున్నాయి. దిల్లీలోని ప్రమాదకర కాలుష్యం, శాంతిభద్రతల అంశం, మహిళలపై నేరాలు, మహా నగరంలోని మౌలిక వసతుల లేమి వంటి అంశాలన్నీ చర్చకు నోచుకోవడం లేదు.

ఆప్ హామీల వర్షం
మునుపెన్నడూ లేని విధంగా ఈసారి దిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉచిత హామీలను నమ్ముకొని ఎన్నికల క్షేత్రంలోకి దూకింది. లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలోని అన్ని సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. బలంగా ఉన్న బీజేపీని ఢీకొనాలంటే ఉచిత హామీలు మించిన మరో మార్గం ఆప్‌నకు కనిపించడం లేదు. ఆప్ అగ్రనేతలపై అవినీతి కేసుల మరక పడింది. కేంద్ర ప్రభుత్వం వేధింపుల్లో భాగంగానే ఆ కేసులు అని చెబుతూనే, ఉచితహామీలతో ప్రజలకు చేరువయ్యేందుకు అరవింద్ కేజ్రీవాల్ జట్టు యత్నిస్తోంది. ఈ క్రమంలో పలు కీలక ఉచితహామీలను కేజ్రీవాల్ ప్రకటించారు.

అపార్ట్‌మెంట్లు, కాలనీల్లోని ప్రజలను ఆకట్టుకునేలా ఒక స్కీంను ఆయన అనౌన్స్ చేశారు. సెక్యూరిటీ గార్డులను నియమించుకునేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు ఆర్థిక సాయం అందిస్తామని ఆప్ అధినేత తెలిపారు.

  • ఉచితంగా విద్యుత్, విద్య, నీటి వసతి, వైద్య సేవలు, మహిళలకు ప్రజారవాణా వంటి అంశాలను ప్రజలకు వివరించేందుకు 'రేవ్డీ పర్ చర్చా' ప్రచార కార్యక్రమాన్ని ఆప్ నిర్వహిస్తోంది.
  • ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు ప్రతినెలా రూ.2,100 అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనను కేజ్రీవాల్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
  • ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సీనియర్ సిటిజెన్లకు ఉచిత వైద్యాన్ని అందించే సంజీవని యోజనను ఆయన ప్రకటించారు.

కాంగ్రెస్ సైతం
కాంగ్రెస్ పార్టీ సైతం వివిధ ఉచిత హామీలతో ఎన్నికల బరిలోకి దూకింది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతినెలా రూ.2,500 చొప్పున అందిస్తామని అంటోంది. ఇందుకోసం 'ప్యారీ దీదీ యోజన'ను అమలు చేస్తామని చెబుతోంది. దీంతో పాటు జీవన్ రక్షా యోజన ద్వారా రూ.25 లక్షల దాకా బీమా కవరేజీని కల్పిస్తామని హస్తం పార్టీ వెల్లడించింది.

ఉచితాలను కొనసాగిస్తామంటున్న బీజేపీ
ఉచిత హామీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. వాటిని 'ఫ్రీ కీ రేవ్డీ'లుగా అభివర్ణించారు. అయితే తాము ఎన్నికల్లో గెలిస్తే వాటన్నింటిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ సంక్షేమ పథకాల ముసుగులో కుంభకోణాలకు పాల్పడిన వాళ్ల భరతం పడతామన్నారు. ఈ ఎన్నికల్లో నెలకొన్న హోరాహోరీ పోటీ వల్లే ఉచిత సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని మోదీ చెప్పారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్న రాజకీయ పార్టీలు ఉచిత హామీలతో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. త్వరలోనే బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. అందులోనూ పలు ఉచిత హామీల ప్రస్తావన ఉంటుందని తెలిసింది. ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం వంటి హామీలు బీజేపీ మేనిఫెస్టోలో ఉంటాయని సమాచారం.

అసలైన ప్రజా సమస్యలివీ

  • దిల్లీలో కాలుష్య సమస్య కొరకరాని కొయ్యగా మిగిలింది. దీనివల్ల హస్తిన ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పు పొంచి ఉంది. 2024 సంవత్సరం నవంబరులో దిల్లీలో గాలి నాణ్యతా సూచి(ఏక్యూఐ) 490 పాయింట్లకు పడిపోయింది. దీనికి పరిష్కారాన్ని సూచించే మార్గాన్ని ఏ ఒక్క పార్టీ కూడా చూపించడం లేదు.
  • దిల్లీకి ప్రధాన జలవనరుగా ఉన్న యమునా నదిలో అమోనియా అధిక మోతాదులో ఉంది. ఆ నీటిని శుద్ధి చేసే ప్లాంట్ల సామర్థ్యం అంతంత మాత్రమే ఉంది. ఫలితంగా దిల్లీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు సరిపడా నీటి పంపిణీ జరగడం లేదు.
  • గత వర్షాకాలంలో భారీ వర్షాలకు దిల్లీ జలమయం అయింది. ఎన్నో ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. పలుచోట్ల ఓపెన్ నాలాలు, డ్రైనేజీల్లో పడి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. రాజీందర్ నగర్‌లో ఉన్న ఒక సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి వరద నీరు చేరి ముగ్గురు అభ్యర్థులు మునిగిపోయారు. అధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయించడంపై రాజకీయ పార్టీలు ఊసెత్తడం లేదు.
  • దిల్లీ పరిధిలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపుల ఘటనలు పెరిగాయి. శాంతిభద్రతలను నియంత్రణలో ఉంచే ప్రణాళికలను రాజకీయ పార్టీలు ప్రకటించడం లేదు.
  • దిల్లీలో భారీగా నిరుద్యోగులు ఉన్నారు. వారికి ఉపాధిని కల్పించే పథకాలపైనా పార్టీలు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు.
  • వివిధ ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారు.

ABOUT THE AUTHOR

...view details