Free Food For Voters In Karnataka : లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే వారికి ఉచితంగా ఆహారం అందించాలన్న బెంగళూరు హోటల్ అసోసియేషన్ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. ఓటు వేసేందుకు వచ్చేవారికి ఉచితంగా భోజనం పెట్టేందుకు బెంగళూరు హోటల్ అసోసియేషన్‌కు న్యాయస్థానం అనుమతినిచ్చింది. అయితే, అంతకుముందు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే కస్టమర్లకు ఉచిత ఆహారం పెట్టాలన్న బెంగళూరు హోటల్ అసోసియేషన్ నిర్ణయంపై బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బెంగళూరు హోటల్ అసోసియేషన్, నిసర్గ గ్రాండ్ హోటల్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని సింగిల్ సభ్య ధర్మాసనం విచారించింది.
ఎలాంటి దురుద్దేశం లేదు
లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హోటల్‌కు వచ్చిన కస్టమర్లకు ఉచిత ఆహారం పెట్టడం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదనలు వినిపించారు. లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను పెంచేందుకే ఈ పనిని చేపట్టామని తెలిపారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు గతంలో కూడా ఉచితంగా భోజనం పంపిణీ చేశామన్నారు. కాబట్టి తమ నిర్ణయాన్ని అనుమతించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు, ఎక్కువ శాతం ఓటింగ్ జరగాలనే సదుద్దేశంతో ఉచితంగా ఆహారం అందించాలన్న బెంగళూరు హోటల్ అసోసియేషన్ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పిటిషనర్ మంచి మనసును మెచ్చుకుంది.