Free Electricity Supply To Topper House :ఇంట్లో కరెంట్ లేక కొవ్వొత్తుల వెలుగులో చదువుకున్న ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్షల్లో అదరగొట్టింది. 500కి 492 మార్కులు సాధించిన ఆ విద్యార్థిని, తన ఇంటికి ఉచిత విద్యుత్ కనెక్షన్ వచ్చేలా చేసింది. దీంతో ఆమెతోపాటు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
మీడియాతో అలా చెప్పిన తర్వాత!
తమిళనాడులోని తిరువారూర్‌కు చెందిన బాల, సుధ దంపతుల 14 ఏళ్ల కుమార్తె దుర్గా దేవి, స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకుంది. ఇటీవల జరిగిన పరీక్షల్లో 500కి గాను 492 మార్కులు సాధించింది. పాఠశాలలో ప్రథమ స్థానం, జిల్లాలో ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన దుర్గాదేవి, గత రెండేళ్లలో తమ ఇంట్లో విద్యుత్ లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
మొదటి స్థానంలో నిలవడమే!
సెల్‌ఫోన్ టార్చ్‌లైట్, కొవ్వొత్తుల వెలుగులో చదువుకున్నానని దుర్గ చెప్పింది. విద్యుత్ కనెక్షన్ పొందడానికి తమ వద్ద డబ్బులు లేవని తెలిపింది. దీనిపై స్పందిచిన తిరువారూర్ ఎమ్మెల్యే, డీఎంకే నేత పూండి కలైవానన్, విద్యార్థిని ఇంటికి విద్యుత్ కనెక్షన్ అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే పదోతరగతిలో మంచి మార్కులు సాధించానని, ఇంటర్మీడియట్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడమే తన లక్ష్యమని తెలిపింది దుర్గ. డాక్టర్ అవ్వాలనేది తన ఆశయమని చెబుతోంది.
"10వ తరగతి సాధారణ పరీక్షలో 500కి 492 మార్కులు సాధించాను. జిల్లాలో రెండో స్థానంలో నిలిచాను. మా ఇంట్లో రెండేళ్ల నుంచి కరెంటు లేదు. విద్యుత్ లేకుండా టార్చిలైట్ వెలుగులో చదువుకున్నాను. ఆ తర్వాత శాసనసభ్యులు, ఉపాధ్యాయులు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి విద్యుత్ కనెక్షన్ వచ్చింది. నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను అదే స్కూల్‌లో పన్నెండో తరగతి చదివి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించాలనేది నా కల"