Fraud In CM Samuhik Marriage Scheme :ముహూర్తం సమయానికి పెళ్లి కుమారుడు రాకపోవడం వల్ల మరో వ్యక్తిని వివాహం చేసుకుంది ఓ వధువు. ఈఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝూన్సీలో జరిగింది. సీఎం సామూహిక వివాహాల పథకం ప్రయోజనాలను పొందేందుకే వదువు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.
ఇంతకీ ఏం జరిగిందింటే?
ఝాన్సీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా ముఖ్యమంత్రి సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 132 జంటలు అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాయి. ఇందులో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి వధూవరులు వచ్చారు. ఇందులో ఝాన్సీ బామోర్కు చెందిన ఖుషీ వివాహం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌కు చెందిన బ్రిష్భన్తో నిశ్చయమైంది. ఈ సామూహిక వివాహ వేడుకలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. వారిద్దరి పేరుతో 36 నంబర్ రిజిస్ట్రేషన్ నమోదైంది. అయితే, ఖుషీ వివాహం బ్రిష్భన్తో జరగాల్సి ఉండగా అతడికి బదులుగా మరో వ్యక్తి వరుడిగా కనిపించాడు. దీనిపై వారిని అడగగా, 'పెళ్లి కుమారుడు రాలేకపోయాడు. కొంతమంది అధికారుల సలహా మేరకు బ్రిష్భన్ స్థానంలో తాను వరుడిని అయ్యాను' అని నకిలీ వరుడు చెప్పాడు. అతడికి ఇదివరకే పెళ్లి అయ్యిందని, ఖుషీకి వరుసకు బావ అవుతారని తెలిసింది.