Farmers Protest India 2024 :దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని రైతు సంఘ నాయకుడు సర్వాన్ సింగ్ పంధేర్ డిమాండ్ చేశారు. శంబు, కన్నౌరీ సరిహద్దుల్లో తాము చేస్తున్న ఆందోళనలు 13వరోజుకు చేరుకున్నాయని తెలిపారు. ఆదివారం ప్రపంచ వాణిజ్య సంస్థ-డబ్ల్యూటీఓ విషయంపై చర్చిస్తామని, సాయంత్రం మీడియా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
వ్యవసాయ రంగాన్ని డబ్ల్యూటీఓ నుంచి తీసేయాలని తాము ఇది వరకే డిమాండ్ చేశామని సర్వాన్ సింగ్ పంధేర్ తెలిపారు. సోమవారం (ఫిబ్రవరి 26) తర్వాత కార్యాచరణను పంధేర్ ప్రకటించారు. సోమవారం డబ్ల్యూటీఓ, కార్పొరేట్ సంస్థలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 20 అడుగుల దిష్టిబొమ్మలను దహనం చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 27న కిసాన్ మజ్దూర్ మోర్చా, ఎస్కేఎమ్ సంస్థలు దేశవ్యాప్తంగా తమ రైతు నాయకులతో సమావేశం నిర్వహిస్తామని, ఆ తర్వాత రోజు చర్చలు జరపుతాయని వెల్లడించారు. ఇక ఫిబ్రవరి 29న చలో దిల్లీపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.
'మా డిమాండ్లు నెరవేరేవరకు ఉద్యమం ఆగదు'
ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేవరకు ఉద్యమాన్ని ఆపేదే లేదని రైతుల నేత సర్వన్‌సింగ్ పంధేర్ తేల్చిచెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి తామేమీ కలవరం చెందడం లేదని, అది అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆందోళన కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదిస్తే ఉద్యమంపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.