Farmers Government Talks :రైతు సంఘాలతో కేంద్రం జరిపిన మూడో విడత చర్చలు గురువారం అర్ధరాత్రి తర్వాత ముగిశాయి. డిమాండ్లపై ఏకాభిప్రాయం సాధించడానికి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించాయి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. రైతు సంఘాలతో చర్చలు సానుకూలంగానే సాగాయని చెప్పారు. ఈనెల 18న(ఆదివారం) సాయంత్రం ఆరు గంటలకు నాలుగో విడత చర్చలు ఉంటాయని వెల్లడించారు.
కాగా, రైతు సంఘాలతో చర్చల్లో కేంద్రం తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ హాజరయ్యారు. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా కేంద్రం రైతు సంఘాలతో జరిపిన చర్చల్లో పాల్గొన్నారు. గురువారం రాత్రి 8గంటల 45 నిమిషాలకు ప్రారంభమైన చర్చలు దాదాపు 5గంటల పాటు కొనసాగాయి. ఇరు పక్షాలు ఒక్కో అంశంపై సవివరంగా చర్చించుకున్నాయని భగవంత్ మాన్ తెలిపారు. పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు.
సంగ్రూర్, పాటియాలా, ఫతేఘడ్ సాహిబ్‌లో ఇంటర్నెట్పై ఆంక్షల ఆంశాన్ని కేంద్రం ముందు లేవనెత్తినట్లు భగవంత్ మాన్ చెప్పారు. పంజాబ్‌లోని ఆందోళనకారులపై హరియాణా పోలీసులు డ్రోన్‌ను ఉపయోగించి బాష్పవాయువు గోళాలు ప్రయోగించడాన్ని కూడా తాను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. హరియాణా- పంజాబ్ సరిహద్దుల్లో శాంతి భద్రతలను కాపాడుతామని కేంద్రం హామీ ఇచ్చిందని అన్నారు.