Farmer Died In Protest : పంజాబ్- హరియాణా సరిహద్దులో రైతులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితుల్లో మరో అన్నదాత ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కొద్ది రోజుల క్రితం ప్రయోగించిన టియర్ గ్యాస్ కారణంగా ఖనౌరీ సరిహద్దులో ఉన్న దర్శన్ సింగ్(62) అనే రైతు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. దీంతో గురువారం అర్ధరాత్రి దర్శన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే పట్రాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు రైతులు. పరిస్థితి విషమించడం వల్ల పాటియాలాలోని రాజేంద్ర ఆసుపత్రికి తరలిస్తుండగా గుండెపోటుతో రైతు దర్శన్ సింగ్ మరణించాడు.
పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్
తమ డిమాండ్లపై సాధనకు 'దిల్లీ చలో'కు రైతులు పిలుపినిచ్చిన నేపథ్యంలో ఫిబ్రవరి 13 నుంచి పంజాబ్-హరియాణా సరిహద్దులో భటిండా జిల్లాలోని గోనేయానాకు చెందిన దర్శన్ సింగ్ (62) పాల్గొన్నాడు. భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించిన కారణంగానే దర్శన్ సింగ్ మరణించాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దర్శన్ సింగ్ ఎనిమిదెకరాల భూమి, రూ.8 లక్షల అప్పు ఉందని సమాచారం. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 15 రోజుల క్రితమే దర్శన్ సింగ్ కుమారుడికి వివాహం జరిగింది. దర్శన్‌సింగ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. దర్శన్ సింగ్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని తెలిపారు.
'వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే అంత్యక్రియలు'
మరోవైపు కర్షకుల ఆందోళనల్లో మరణించిన యువరైతు శుభకరణ్ సింగ్ మృతికి కారణమైనవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మరోసారి రైతు నేతలు డిమాండ్ చేశారు. అంతవరకు శుభకరణ్ సింగ్ మృతదేహానికి దహన సంస్కారాలు జరగవని అన్నారు. మృతుడు శుభకరణ్ సింగ్ కుటుంబానికి రూ. కోటి పరిహారం, అతడి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రకటించిన కొన్ని గంటలకే రైతు నేతలు ఈ ప్రకటన చేయడం గమనార్హం.
'శుభకరణ్ సింగ్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు అది కుదరదని అధికారులు చెబుతున్నారు. మేము శుభకరణ్ సింగ్ కుటుంబానికి అన్ని విషయాలు తెలియజేశాం. వారికి డబ్బు ముఖ్యం కాదు. శుభకరణ్ సింగ్ మృతికి కారణమైనవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాకే ఆయన దహన సంస్కారాలు నిర్వహిస్తాం. దిల్లీ చలోపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం.' అని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. మరోవైపు, పంజాబ్- హరియాణా సరిహద్దులోని ఖనౌరీ పాయింట్ వద్దకు వెళ్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.