Electoral Bonds Issue Supreme Court : రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. ఈ ఎన్నికల బాండ్ల పథకం వల్ల జరిగిన భారీ ఆర్థిక అక్రమాలపై పూర్తిస్థాయిలో అత్యున్నత ధర్మాసనం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థలు, దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలు నీకిది- నాకది(క్విడ్ ప్రొ క్వో) తరహాలో అక్రమాలకు పాల్పడడానికి ఈ పథకం ఓ వాహకంగా ఉపయోగపడిందని పిటిషనర్లు ఆరోపించారు. కామన్ కాజ్, సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే సంస్థలు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ద్వారా ఎన్నికల బాండ్లపై ఈ పిటిషన్ వేశాయి.
'దర్యాప్తు చేసేందుకు ఆధారాలున్నాయి'
ఈ పథకం ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు భారీ మొత్తంలో విరాళాలు ఇవ్వడానికి డొల్ల కంపెనీలు, నష్టాల్లో ఉన్న కంపెనీలకు నిధులు ఎలా వచ్చాయో తేల్చేలా దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టుకు ఈ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. 2జీ, బొగ్గు కుంభకోణాల్లో నగదు చేతులు మారిన్నట్లు ఆధారాలు లేకపోయినా, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించారని ఈ సందర్భంగా గుర్తు చేశాయి. ఎన్నికల బాండ్ల పథకం కేసులో 'నీకిది నాకది' తరహాలో రూ.వేల కోట్ల సొమ్ము చేతులు మారాయని చెప్పాడనికి స్పష్టమైన ఆధారాలు ఉన్నందు వల్ల కుంభకోణాన్ని ఛేదించడానికి ప్రత్యేక దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి. సంస్థ ఏర్పాటైన మూడేళ్లలోగానే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం కంపెనీల చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నాయి.